ఎల్పీజీ vs పీఎన్జీ: ఏది చౌక? ఏది సురక్షితం? పూర్తి వివరాలు మీకోసం..
మరోవైపు పీఎన్జీ నెట్ వర్క్ పై ప్రజల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పీఎన్జీ ధరలు, రక్షణపై ఎక్కువ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.;
దిగుమతులపై ఆధారపడుతున్న వంట గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఎలాంటి ఉద్రికత్తలు తలెత్తినా, మనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దేశీయంగా తయారయ్యే పీఎన్జీని అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం పది లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు నెల రోజుల్లో లక్ష కనెక్షన్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఇంత తక్కువ టైములు ఆ లక్ష్యాన్ని చేరుకోగలదా? అసలు రాష్ట్రంలో పీఎన్జీ ఉందా? ఎక్కడ నుంచి సరఫరా చేస్తారు? ధరలు, రిస్క్ ఇలా అనేక అంశాలపై చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం వంట గ్యాస్ గా వినియోగిస్తున్న ఎల్పీజీ కోసం పూర్తిగా విదేశాలపై ఆధారపడాల్సివస్తోంది. దీనికి బదులుగా ఏపీ ప్రభుత్వం పీఎన్జీ వినియోగాన్ని పెంచాలనే నిర్ణయం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో పీఎన్జీ సరఫరా వ్యవస్థ ఇవరయ్యేళ్ల క్రితమే మొదలైంది. కానీ, ఎల్పీజీ సరఫరా మెరుగ్గా ఉండటం, కొత్త గ్యాస్ విధానంపై ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో పీఎన్జీ వినియోగం అనుకున్న స్థాయిలో లేదని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీఎన్జీ, సీఎన్జీ (CNG) పంపిణీ కోసం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL)ని 2003 ఆగస్టులో ఏర్పాటు చేశారు. కృష్ణా-గోదావరి (KG) బేసిన్ నుండి లభిస్తున్న సహజ వాయువును శుద్ధి చేసి పైపు లైన్ల ద్వారా సరఫరా చేయాలని అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిర్ణయించారు.
పీఎన్జీ ఎలా సరఫరా చేస్తారు?
భూగర్భంలోని శిలల పొరల మధ్య, సముద్ర గర్భంలో సహజ వాయువు లభిస్తుంది. దీన్ని వెలికితీసిన తర్వాత శుద్ధి కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ నీరు, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి ఇతర పదార్థాలను తొలగించి రవాణాకు అనుకూలమైన 'డ్రై గ్యాస్' గా మారుస్తారు. ఈ వాయువును భారీ పైప్‌లైన్ల ద్వారా నగరాల వరకు (City Gate Stations), అక్కడి నుండి చిన్న పైపుల ద్వారా నేరుగా ఇళ్లలోని వంటగది వరకు సరఫరా చేస్తారు. అందుకే దీన్ని 'పైప్డ్ నేచురల్ గ్యాస్' అని పిలుస్తారు. ఈ గ్యాస్ ను రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో సరఫరా చేయాలని గతంలోనే నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ప్రధాన నగరాల్లో పీఎన్జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలో 2005 నుంచి ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది.
10 లక్షల కనెక్షన్ల లక్ష్యం
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల గృహాలకు పీఎన్జీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అంటే ప్రస్తుత ఇంధన సంక్షోభం (ముఖ్యంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు) దృష్ట్యా ఇది ఒక వ్యూహాత్మక అవసరంగా చెబుతున్నారు. పైప్‌లైన్ నెట్‌వర్క్ ఇప్పటికే ఉన్న విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో పీఎన్జీ సరఫరా వేగవంతం చేయడం సాధ్యమే అంటున్నారు. అందుకే వచ్చే నెల రోజుల్లో లక్ష కనెక్షన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ధీమాగా ఉంది. మరోవైపు తన లక్ష్యానికి ఎవరూ అడ్డుపడకుండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ, అప్లికేషన్ పెట్టుకున్న 24 గంటల్లోనే అనుమతులు ఇచ్చేలా 'ఆటోమేటెడ్ అప్రూవల్ సిస్టమ్'ను తీసుకువచ్చింది.
ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పీఎన్జీ మౌలిక సదుపాయాలు కేవలం 2.34 లక్షల కనెక్షన్లు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెబుతున్నారు. ఇదేసమయంలో కేవలం 60,000 మంది వినియోగదారులు మాత్రమే ఇప్పటివరకు పీఎన్జీ సేవలను వాడుతున్నారు. దీంతో నెల రోజుల్లో ప్రభుత్వ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా దీర్ఘకాలంలో 10 లక్షల గృహాలకు దీన్ని విస్తరించాలని లక్ష్యాన్ని చేరుకోడానికి కొన్ని పరిపాలన పరమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని అంటున్నారు.
కొత్త వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరఫరా నెట్‌వర్క్ పెంచేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నుంచి పీఎన్జీ సరఫరా కోసం "మిషన్ మోడ్" లో పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. కాకుళం-కాకినాడ మధ్య సుమారు 300 కి.మీ పొడవున్న కీలక పైప్‌లైన్ పనులను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు గ్యాస్ సరఫరా మరింత మెరుగుపడుతుందని చెబుతున్నారు.
ఇక పైపు లైన్ల నిర్మాణానికి ఎవరూ ఆటంకాలు సృష్టించకుండా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పైప్‌లైన్ వేయడానికి అవసరమైన అనుమతులను కేవలం 24 గంటల్లోనే ఇచ్చేలా ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు అభ్యంతరం తెలపకపోతే 30 రోజుల తర్వాత అవి 'డీమ్డ్ అప్రూవల్' (ఆమోదించినట్లు) గా పరిగణించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రభుత్వం పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి 'దీపం' పథకం కింద ఇచ్చే రాయితీ సుమారు రూ.2,400 పీఎన్జీ వాడే వారికి కూడా డిబిటి (DBT) ద్వారా చెల్లిస్తామని ప్రకటించింది.
మరోవైపు పీఎన్జీ నెట్ వర్క్ పై ప్రజల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పీఎన్జీ ధరలు, రక్షణపై ఎక్కువ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎల్పీజీతో పోల్చుకుంటే పీఎన్జీ చౌక అని, సురక్షితమని నిపుణులు వివరిస్తున్నారు. ఒక్కమాటలో ఆధునిక జీవనశైలికి పీఎన్జీ ఒక చక్కని పరిష్కారంగా వ్యాఖ్యానిస్తున్నారు. తక్కువ ధర, ఎక్కువ భద్రత, మెరుగైన సౌకర్యం కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక అంటున్నారు.
అందుబాటులో ధర
ప్రస్తుతం ఎల్పీజీ ధర 14.2 కిలోల సిలెండర్ కు సుమారుగా వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సివుంటుందని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో ఈ ధర తరచూ మారుతూ ఉంటుంది. అదే సమయంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, అది వచ్చే వరకు వేచి చూడటం, అయిపోతుందేమోనన్న టెన్షన్.. ఇవన్నీ అనుభవించాల్సివుంటుందని అంటున్నారు. అదే పీఎన్జీ కనెక్షన్ ఉంటే ఇలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పీఎన్జీ గ్యాస్ ధర క్యూబిక్ మీటరు రూ.48 నుంచి 51 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఎల్పీజీ గ్యాస్ సిలెండరుకు సమానమైన పీఎన్జీని వినియోగిస్తే సుమారు రూ.750 మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇక ఈ గ్యాస్ వినియోగానికి కనెక్షన్ల కోసం సుమారుగా రెండు వేలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
చాలా సురక్షితం
ఇక ఎల్పీజీతో పోల్చుకుంటే పీఎన్జీ వినియోగం చాలా సురక్షితమంటున్నారు. ఎల్పీజీ గాలి కంటే ఎక్కువ బరువుగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే అది నేలపైనే పేరుకుపోతుందని, దీనివల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, పీఎన్జీలో ఉండే మీథేన్ గాలి కంటే చాలా తేలిక అంటున్నారు. ఒకవేళ పీఎన్జీ లీక్ అయినా అది వెంటనే గాలిలో కలిసిపోతుందని, మంటలు అంటుకునే ప్రమాదం చాలా తక్కువ అంటున్నారు. ఇక ఎల్పీజీ సిలిండర్లలో గ్యాస్ చాలా ఎక్కువ ఒత్తిడితో (High Pressure) ఉంటుంది. పీఎన్జీ పైపుల్లో గ్యాస్ ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. మనం నోటితో ఊదే గాలి కంటే కూడా తక్కువ ఒత్తిడితో పీఎన్జీ గ్యాస్ ఉంటుందని, దీనివల్ల పైపులు పేలిపోయే ప్రమాదం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.