పెట్రోల్ కాకపై.. లేటైనా రేవంత్ ఘాటు స్పందన!
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన దరిమిలా.. రాష్ట్రాలు ఆయా ప్రభుత్వాల పరిధిలో కొంత మేరకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి ఒకరోజు గడిచింది. శుక్రవారం తెలతెల వారుతూనే.. పెట్రోల్ పై 3, డీజిల్‌పై రూ.3 చొప్పున పెట్రోలియం కంపెనీలు బాదేశాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం కాక రేపింది. పెట్రోలు, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచినందుకన్నా కూడా.. కార్యాకారణ సంబంధంగా వీటి కారణంగా.. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ వ్యవహారమే దేశవ్యా ప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉండగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆచి తూచి స్పందించారు. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై శనివారం స్పందిస్తూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఐదు రాష్ట్రా ల ఎన్నికల ప్రచారంలో పెట్రోలు ధరలు పెంచేది లేదని చెప్పారని.. ఎన్నికలు ముగిసి.. 10 రోజులు కూడా కాకుండానే.. ధరలు పెంచారని వ్యాఖ్యానించారు.
ఈ చర్యను ఆయన విశ్వాస ఘాతుకంగా అభివర్ణించారు. అంతేకాదు.. ఈ పెంపు.. ఇతర అంశాలపైనే ఎక్కువగా పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. సామాన్యులపై పిడుగు వంటిదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అనాలోచిత చర్యగా పేర్కొన్నారు. విశ్వగురు చేయాల్సిన పనేనా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామనే ప్రధాని మోడీ.. ఈ పెంపును ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించుకోవాలన్నారు.
రాష్ట్రంలో చేయొచ్చు..
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన దరిమిలా.. రాష్ట్రాలు ఆయా ప్రభుత్వాల పరిధిలో కొంత మేరకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవచ్చు. స్థానిక పన్నులను తగ్గించడం ద్వారా ప్రజలపై రూ.1 నుంచి 1.50 వరకు భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. అయితే.. రాష్ట్రాలకు వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోతుం దన్న కారణంగా.. ప్రభుత్వాలు కూడా మౌనంగా ఉంటున్నాయి.