రూపాయి పతనం.. ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీగా భారత్‌!

అమెరికా–ఇరాన్‌ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

Update: 2026-05-16 13:30 GMT

అమెరికా–ఇరాన్‌ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు అనిశ్చితిలో కూరుకుపోయిన వేళ ముడి చమురు ధరల పెరుగుదలతో అనేక దేశాల కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం అత్యధికంగా కనిపిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. భారత రూపాయి 2026లో ఆసియాలోనే అత్యంత బలహీన ప్రదర్శన కనబరుస్తున్న కరెన్సీగా మారడం ఆందోళన కలిగిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.95.8 స్థాయికి పడిపోవడం దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ 6.5 శాతానికి పైగా పడిపోవడం విదేశీ పెట్టుబడిదారులు, పరిశ్రమలు, దిగుమతులపై ఆధారపడే రంగాలను కలవరపెడుతోంది.

రూపాయి పతనానికి కేవలం అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులే కారణం కావు. పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారత దిగుమతి బిల్లును భారీగా పెంచుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. దీనికితోడు దేశంలో కొనసాగుతున్న ప్రస్తుత ఖాతా లోటు, ఆర్థిక మార్కెట్లపై నియంత్రణలు, ఎఫ్‌పీఐల నిష్క్రమణ, ఆఫ్‌షోర్‌–ఆన్‌షోర్‌ మార్కెట్ల మధ్య అసమతుల్యత, గ్లోబల్‌ ఏఐ మార్పులతో సేవల ఎగుమతుల్లో ఏర్పడుతున్న అనిశ్చితి వంటి నిర్మాణాత్మక సమస్యలు కూడా రూపాయి బలహీనతకు కారణాలుగా మారాయి. రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా డాలర్లను విక్రయిస్తూ జోక్యం చేసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నిపుణులు భావిస్తున్నారు.

ఇక ఆసియా దేశాల కరెన్సీల పరిస్థితి కూడా అంతే ఆందోళనకరంగా ఉంది. ఇండోనేషియా రూపియా డాలర్‌కు 17,600 స్థాయిని దాటి 4.6 శాతం వరకు బలహీనపడింది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, డాలర్‌ బలం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఫిలిప్పైన్స్‌ పెసో కూడా రాజకీయ అస్థిరత కారణంగా రికార్డు స్థాయిలో పడిపోయి డాలర్‌కు 61.64 స్థాయికి చేరుకుంది. వైస్‌ ప్రెసిడెంట్‌ సారా డూటర్టేపై ఇంపీచ్‌మెంట్‌ విచారణ ప్రభావం అక్కడి మార్కెట్లపై పడుతోంది.

దక్షిణ కొరియా వాన్‌ కూడా ఈ ఏడాది 3 శాతం వరకు బలహీనపడింది. 1,496.47 నుంచి 1,498.06 వరకూ మాత్రమే పెరగింది. దేశీయ పెట్టుబడిదారులు అమెరికా మార్కెట్ల వైపు మళ్లడంతో మూలధన పలాయనం పెరుగుతోంది. థాయ్‌లాండ్‌ బాట్‌పై కూడా ముడి చమురు ధరల ప్రభావం తీవ్రంగా పడింది. ఒక డాలర్ కు 32.58 బాట్స్ గా ఉంది. బంగారం ధరల మార్పులు, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, దిగుమతి ఖర్చుల పెరుగుదల బాట్‌ను మరింత బలహీనపరుస్తున్నాయి.

అయితే హాంకాంగ్‌ డాలర్‌ మాత్రం పెగ్‌ వ్యవస్థ కారణంగా పెద్దగా నష్టపోలేదు. హాంకాంగ్‌ మానిటరీ అథారిటీ జోక్యంతో అది స్థిరంగా కొనసాగుతోంది. తైవాన్‌ డాలర్‌ కూడా స్వల్ప నష్టంతోనే నిలిచింది. డాలర్ కు 7.85 హాంకాంగ్ డాలర్ గా కొనసాగుతోంది. అక్కడి ఎగుమతిదారులు డాలర్‌ నిల్వలను స్థానిక కరెన్సీకి మార్చడం వల్ల కొంత స్థిరత్వం కనిపిస్తోంది.

మొత్తానికి 2026లో ఆసియా కరెన్సీలు ఎదుర్కొంటున్న సంక్షోభం ప్రపంచ ఆర్థిక అస్థిరతకు ప్రతిబింబంగా మారింది. అయితే భారత రూపాయి పరిస్థితి మాత్రం మరింత లోతైన ఆర్థిక బలహీనతలను బయటపెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న చమురు ధరలు, దేశీయ ఆర్థిక సవాళ్లు కలిసి రూపాయిపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. రాబోయే నెలల్లో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకునే నిర్ణయాలే భారత ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

Tags:    

Similar News