సర్వీసులకు బ్రేక్.. నో ఆన్లైన్ ఆర్డర్స్!

దేశవ్యాప్తంగా ఓలా, ఉబెర్ క్యాబ్‌లు బుక్ చేసుకునే వారికి, అలాగే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ యాప్స్ ద్వారా ఫుడ్ మరియు నిత్యవసర సరుకులు ఆర్డర్ చేసే వారికి శనివారం ఒక షాకింగ్ న్యూస్ ఎదురైంది.

Update: 2026-05-16 07:56 GMT

దేశవ్యాప్తంగా ఓలా, ఉబెర్ క్యాబ్‌లు బుక్ చేసుకునే వారికి, అలాగే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ యాప్స్ ద్వారా ఫుడ్ మరియు నిత్యవసర సరుకులు ఆర్డర్ చేసే వారికి శనివారం ఒక షాకింగ్ న్యూస్ ఎదురైంది. నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా 'గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్' దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె ఎందుకు జరుగుతోంది, దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకుందాం..

మధ్యాహ్నం సర్వీసులు బంద్:

ఇంధన ధరల పెరుగుదల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని గిగ్ వర్కర్లు అంటే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 5 గంటల పాటు అన్ని రకాల యాప్ ఆధారిత సేవలను నిలిపివేయాలని యూనియన్ పిలుపునిచ్చింది. ఇక ఈ పాన్-ఇండియా షట్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ డెలివరీలు, క్యాబ్ సర్వీసులకు బ్రేక్ పడే అవకాశం ఉంది.

ఎండ తీవ్రత.. పెరిగిన ఖర్చులు:

ఇక ఇదంతా ఎందుకంటే యాజమాన్యం మాట్లాడుతూ.. ఇప్పటికే దేశంలో ఎండలు మండిపోతున్నాయని, ఇలాంటి కష్టకాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం డెలివరీ భాగస్వాములపై మోయలేని భారంగా మారిందని అన్నారు. ఇక ఒకవైపు ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, మరోవైపు నిత్యావసరాల ఖర్చులు పెరిగిపోవడంతో రోజువారీ సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని వారు బాధను వ్యక్తం చేసారు.

కిలోమీటరుకు రూ. 20 డిమాండ్:

ప్రస్తుతం కంపెనీలు ఇస్తున్న ఇన్సెంటివ్‌లు పెట్రోల్ బిల్లులకు, వెహికల్ సర్వీసింగ్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని గిగ్ వర్కర్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం, అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్ కంపెనీలు స్పందించి తమకు కిలోమీటరుకు కనీసం రూ. 20 చొప్పున కనీస చెల్లింపులు అందించాలని వారు ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

సామాన్యులపై ప్రభావం:

ఈ ఐదు గంటల సమ్మె కారణంగా ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు ఆర్డర్ చేసేవారికి, అత్యవసరంగా క్యాబ్‌లలో ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పవు. ఇక స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్స్‌లో ఆర్డర్లు ఆలస్యం కావడం లేదా సర్వీసులు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను కంపెనీలు వినకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని యూనియన్ హెచ్చరించింది.

మనం ఫోన్లలో క్లిక్ చేయగానే ఎండనక, వాననక మన ఇంటికి వస్తువులు చేర్చే గిగ్ వర్కర్ల సమస్యలు నిజంగా మనము ఆలోచించదగ్గవే. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా వారి ఆదాయం పెరగకపోతే వారు మనుగడ సాగించడం కష్టం. డిజిటల్ కంపెనీలు, ప్రభుత్వం త్వరలోనే వీరితో చర్చలు జరిపి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాయని మనము ఆశిద్దాం..

Tags:    

Similar News