ఈసారి సీమ కు చాన్స్... బ్యాలన్స్ చేస్తున్న జగన్

Update: 2023-05-26 12:08 GMT
ఏపీలో అమరావతి రాజధాని అని చంద్రబాబు అన్నారు. కాదు మూడు రాజధానులు అని జగన్ తన విధానాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో విశాఖ ను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాజధాని అన్నది కాగితాల మీదనే ఉండిపోయింది. న్యాయపరంగా చిక్కులతో ఆ ప్రతిపాదన అక్కడే ఉంది.

ఇదిలా ఉండగా విశాఖ రాజధాని అంటే ఉత్తరాంధ్రా నుంచి పెద్దగా ఆదరణ లేకపోతే సీమ జనాలు నిరాశపడ్డారని టాక్ నడిచింది. ఆ పరిణామాలే ఇటీవల జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల వేళ బయటపడ్డాయి. ఫలితాలు ఉత్తరాంధ్రా సీమా రెండింటా వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి.

దీంతో ఇపుడు వైసీపీ అధినాయకత్వం సీమ వైపు ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. పదిహేనవ ఆర్ధిక సంఘం దేశంలో ఎనిమిది మహా నగరాలను కొత్తగా నిర్మించాలని కేంద్రానికి సూచించింది. దేశంలోని ఎనిమిది నగరాలలో ఏపీ కి కూడా ఒకటి కేంద్రం నిర్మించి ఇవ్వనుంది. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం ఏపీ ని అడిగిన వెంటనే కడప జిల్లా కొప్పర్తిని జగన్ సర్కార్ ప్రతిపాదించింది

కొప్పర్తి లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మొత్తం  540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్ ని నెలకొల్పుతున్నారు. అలాగే మరో 3167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండింటిలో మౌలిక వసతులు కల్పనతో పాటు ఇతర నిర్మాణం కోసం 1580 కోట్ల ను వెచ్చిస్తున్నారు. అలాగే  పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుచేశారు.

ఈ నేపధ్యంలో కేంద్రం ఏపీ కి కొత్త నగరం ఏర్పాటుకు ముందుకు రావడంతో జగన్ సర్కార్ కొప్పర్తినే ప్రతిపాదించింది. కొప్పర్తి ప్రస్తుతం గ్రామీణ వాసనలతో ఉంది. కొత్త నగరాలు అంటే పచ్చని చెట్లతో పాటు గ్రీన్ ఫీల్డ్ సిటీలుగా రూపకల్పన చేయనున్నారు. ఇక కేంద్రం ఈ నగరాలకు తన వాటాగా వేయి కోట్లను ఇస్తుంది.

ఏతా రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తుంది. దీంతో రహదారులు తాగు నీరు, మురికి నీరు పారుదల వ్యవస్థ వంటివి ఏర్పాటు చేస్తారు. మొత్తానికి కొప్పర్తి రేపటి రోజున ఒక పారిశ్రామిక నగరంగా మారేందు కు అవకాశాలు మెరుగుపడుతున్న వేళ కేంద్రం కొత్త నగరాల జాబితాలో చోటివ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

ఏపీ లో ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకు సాగుతున్న జగన్ సర్కార్ విశాఖ ను ఏపీకి గ్రోత్ ఇంజన్ సిటీగా మార్చాలనుకుంటోంది. దీంతో రాయలసీమలో ఎంతో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దాన్ని సరిచేసుకునేందు కు అన్నట్లుగా కొప్పర్తిని నగరంగా మార్చేందుకు అలా కొత్త నగరం నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు.

దీని వల్ల రానున్న కాలంలో రాయలసీమ కూడా అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని అంటున్నారు. అయితే అమరావతి ఇప్పటికే రాజధానిగా ఉంది కదా కేంద్రం కొత్త నగరాల అభివృద్ధికి ఇచ్చే నిధులను దానికి వినియోగించుకోవచ్చు కదా అన్న సూచనలు ఉన్నాయి. కానీ కొత్త నగరాలు అని కేంద్రం పేర్కొంది. అదే విధంగా జగన్ మార్క్ కూడా ఇక్కడ ఉండాలి. దాంతో పాటు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కాన్సెప్ట్ గా వైసీపీ పెట్టుకుంది అంటున్నారు రాజకీయంగా చూస్తే రాయలసీమ కు వైసీపీ వచ్చిన తరువాత పెద్దగా ఏమీ చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇలా అన్నీ ఆలోచించి కడప జిల్లా కొప్పర్తిని నగరంగా జగన్ ప్రతిపాదించారు అని అంటున్నారు.

Similar News