గన్ను పడతానంటున్న అన్నా హజారే

Update: 2016-09-25 06:23 GMT
ప్రముఖ సామాజిక కార్యకర్త - అవినీతి వ్యతిరేక పోరాటకారుడు అన్నా హజారే సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాదు... పాక్ తీరుతో మండిపడుతున్న భారత యువతకు స్ఫూర్తినిచ్చేలా పాక్ తో కనుక యుద్ధం వస్తే తాను కూడా యుద్ధంలో పాల్గొంటానన్నారు. అయితే... యుద్ధం వల్ల ఎన్నో నష్టాలుంటాయి కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నట్లు చెప్పారు.

ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ యూరీపై దాడిని తీవ్రంగా ఖండించిన హజారే... రెండు దేశాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు పాకిస్థాన్ కళాకారులను దేశం విడిచివెళ్లాలని నవనిర్మాణ సేన హెచ్చరించడంపై ఆయన మాట్లాడుతూ.... యుద్ధం వేరు - కళలు వేరు. కళలను ప్రత్యేకంగా చూడాలి... అవి మానవ జాతికి ఆనందం, స్ఫూర్తి కలిగిస్తాయి. వాటిని తప్పుడు మార్గంలో ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదన్నారు.   కాగా పాకిస్థాన్ తో కనుక యుద్ధం తప్పనిసరైతే తాను కూడా అందులో పాల్గొంటానని ఈ 79 ఏళ్ల ఉద్యమకారుడు చెప్పడంపై అంతటా ఉత్సాహం నెలకొంది.

మరోవైపు హజారే పనిలోపనిగా తన ఒకప్పటి మిత్రుడు... ఇప్పుడు ప్రత్యర్థి అయిన అరవింద్ కేజ్రీవాల్ - ఆయన పార్టీ ఆప్ పై విరుచుకుపడ్డారు.  అరవింద్ కేజ్రీవాల్‌ కు అధికార దాహం ఏర్పడిందని, కేజ్రీవాల్ కేబినెట్‌ లోని మంత్రులను వరుసబెట్టి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పనితీరుకు తాను దు:ఖిస్తున్నానని, ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికి మేలు చేస్తుందనుకోవడం తన తప్పన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News