అప్పట్లో మోడీకి సెక్రటరీ.. ఇప్పుడు బీజేపీలో చేరగానే ఎమ్మెల్సీని చేస్తారట

Update: 2021-01-15 14:30 GMT
జాగ్రత్తగా గమనిస్తే.. ప్రధాని మోడీలో చాలానే కోణాలు కనిపిస్తాయి. తనకు సన్నిహితంగా ఉండే నేతల కంటే కూడా.. అధికారులకు కీలక పదవులు ఇచ్చే ఉదంతం కనిపిస్తుంటుంది. మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అధికారి పేరున్న ఐఏఎస్ అధికారి తాజాగా బీజేపీలోకి చేరటం గమనార్హం. తాను ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు తనకు సన్నిహితంగా ఉండే సదరు అధికారిని బీజేపీలోకి చేర్చటం ఆసక్తికరంగా మారింది.

యూపీకి చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తాజాగా బీజేపీ తీర్థం తీసుకున్నారు. మోడీకి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పని చేసిన సమయంలో.. ఆయనకు కార్యదర్శిగా పని చేశారు. అనంతరం మోడీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలుచేపట్టటం..అందుకు తగ్గట్లే ఆయనకు పోస్టింగ్ లు మారటం జరిగాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ఐఏఎస్ అధికారికంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

గుజరాత్ క్యాడర్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి 1988 బ్యాచ్ కు చెందిన వారు. 2001లో గుజరాత్ కు మోడీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయనకు కార్యదర్శిగా ఉండేవారు. తర్వాత గుజరాత్ మౌలిక సదుపాయాల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. ఎప్పుడైతే ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించారో.. ఆ వెంటనే ఆయన పీఎంవోలో చేరారు.

కరోనా.. ఆ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన చిన్న.. మధ్య తరహా  పరిశ్రమలకు ఉపశమనం కలిగేలా కేంద్రం కసరత్తు చేస్తున్న వేళ.. గత మేలో బదిలీపై వెళ్లిన ఆయన.. తాజాగా బీజేపీలో చేరి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తారని.. అనంతరం యోగి ప్రభుత్వంలో కీలక బాధ్యత అప్పజెబుతారని చెబుతున్నారు.
Tags:    

Similar News