‘ద స్పెక్టేటర్‌’ సంచలన కథనంలో ఏముంది?

Update: 2021-09-22 06:31 GMT
ప్రాశ్చాత్య మీడియా సంస్థ అయిన ‘ద స్పెక్టేటర్‌’ తాజాగా ఒక సంచలన కథనాన్ని అందించింది. ఈ కథనానికి ముందు బ్రిటీష్ మీడియా దిగ్గజమైన గార్డియన్ సైతం ఈ కథనంలోని సందేహాల్ని వ్యక్తం చేయటంతో.. అంతర్జాతీయంగా ఈ కథనంపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. అఫ్గాన్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు.. తెర వెనుక ఏం జరిగిందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండు దశాబ్దాల అనంతరం తాలిబన్లు తాను కోరుకున్న రీతిలో అఫ్గాన్ లో అధికారాన్ని సొంతం చేసుకున్నప్పుడు.. పాలకులుగా ఎవరుంటారు? అన్నది పెద్ద ప్రశ్న. దీనికి అట్టే ప్రయాస చెందకుండానే.. తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్ జాదా బయటకు రాకపోవటం.. యూఎస్ తో శాంతి చర్చల్లో కీలకభూమిక పోషించిన బరాదర్ ప్రధాని అవుతారని భావించారు.

అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. అగ్రరాజ్య సేనలు అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. ఆ దేశం అంచనాలకు మించి చాలా వేగంగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లటం తెలిసిందే. అయితే.. తాలిబన్ల అగ్ర నాయకత్వం మాత్రం బయటకు రాకపోవటం గమనార్హం. ఇదంతా వారి ప్లాన్ లో భాగమా? లేదంటే.. మరేదైనా కారణమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాలిబన్లకు బదులుగా హక్కానీ నెట్ వర్క్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయటం.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పలు ప్రశ్నలకు సమాధానాలు దొరకని వైనంతో కొత్త సందేహాలకు తావిచ్చినట్లైంది.

ఇదే అంశంపై ప్రాశ్చాత్య మీడియా సైతం కొత్త ప్రశ్నల్ని సంధిస్తూ.. విడుదల చేస్తున్న కథనాలు కొత్త వాదనకు తెర తీస్తున్నాయి. అన్నింటికి మించి.. ఈ మధ్యనే గార్డియన్.. తాజాగా ద స్పెక్టేటర్‌ తో పాటు మరిన్ని మీడియా సంస్థలు అఫ్గాన్ లో ఏం జరిగిందన్న దానిపై సరికొత్త కథనాల్నిఅందిస్తున్నాయి. వారి అంచనా ప్రకారం.. ప్రస్తుతం అఫ్గాన్ లో పాలిస్తోంది పాక్ పరోక్ష ప్రభుత్వమన్న మాట బలంగా వినిపిస్తోంది. అదెలా? అన్న ప్రశ్నకు వారు వినిపిస్తున్న వాదనలే దీనికి కారణం.

సందేహాలకు తెర తీస్తున్న వాదనలివే..

1. అఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ సమయం తీసుకోవటం. చివరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. అందులో తాలిబన్లు కాకుండా హక్కానీ నెట్ వర్కు నేతలకు పెద్ద పీట వేయటం ఒక కారణం.

2. అమెరికా సేనలు అఫ్గాన్ ను విడిచి పెట్టటంలో కీలక పాత్ర పోషించిన తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్ జాదా బయటకు రాకపోవటం. శాంతి చర్చల్లో కీలకభూమిక పోషించిన బరాదర్ ప్రధాని అవుతారనుకుంటే.. అలాంటిదేమీ లేకుండా పెద్దగా గుర్తింపు లేని ముల్లా హసన్ ప్రధానిగా ప్రకటించటం.

3. బరాదర్ ను బందీ చేశారా? అఖుండ్ జాదా చనిపోయి ఉంటారా? అన్న సందేహాల్ని వ్యక్తం చేస్తూ ద స్పెక్టేటర్‌ కథనాన్ని వెలువర్చింది. అదెలా జరిగిందన్న దానికి దాని వాదన ఏమంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాబూల్ అధ్యక్ష భనంలో హక్కానీలకు.. తాలిబన్లకు గొడవ జరిగింది. అందులో బరాదర్ తీవ్రంగా గాయపడ్డాడు.
అయితే.. దీనికి సంబంధించిన వార్త కలకలం రేపినా.. తాను బాగున్నట్లుగా ఆడియో సందేశం బయటకు వచ్చింది.

4. అనంతరం ఒక వీడియో చూస్తే.. అందులో బరాదర్ ను బందీగా ఉన్నట్లుగా కనిపించిందంటున్నారు. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేయటం.. పంజ్ షీర్ పై శాంతియుత పరిష్కారాన్ని కోరటం లాంటి బరాదర్ చర్యలు నచ్చకపోవటం హక్కానీ నెట్ వర్కు ఆయనపై దాడి చేసి.. బంధించి ఉంటారని అనుకుంటున్నారు. తాలిబన్ అగ్రనేత అఖుండ్ జాదాను హతమార్చి ఉండొచ్చు.

5. ఒకవేళ నిజంగానే వారిద్దరు బతికి ఉంటే..ఇప్పటికే వారు బయట ప్రపంచానికి కనిపించేవారు కదా? శాంతి చర్చల్లో కీలకంగా వ్యవహరించిన వారు.. సొంత ప్రభుత్వంలో ఎందుకు బయటకు రావట్లేదు? ఆ మాటకు వస్తే.. వీరిద్దరికే అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు ఉంది.

6. తాలిబన్లు తమకు చెందిన అగ్రనేతలు ఎవరైనా మరణిస్తే.. ఆ విషయాన్ని వెంటనే చెప్పకుండా.. ఏళ్లకు ఏళ్లు దాటిన తర్వాత బయటపెట్టటం కొత్తేం కాదు. 2013లో ముల్లా ఒమర్ మరణిస్తే.. ఆ విషయాన్ని 2015లో బయట పెట్టటం నిదర్శనం.

7. హక్కానీ నెట్ వర్కుకు ప్రభుత్వ పగ్గాలు అందటానికి ముందు ఐఎస్ఐ చీఫ్ అఫ్గాన్ కు రావటం చూస్తే.. పాక్ పరోక్ష పాలన అఫ్గాన్ లో సాగుతుంది. తాలిబన్ కీలక నేతలు లేకుండా.. హుక్కాని నెట్ వర్కు పాలించటం ఏమిటి?

8. పాక్ కుయుక్తుల్ని అర్థం చేసుకోకుండా తాలిబన్లు వారిని గుడ్డిగా నమ్మారన్నదే నిజమా? తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఇదే నిజమన్న వాదనను వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News