షైన్యానికి ఫ్రీహ్యాండ్.. రూ.300 కోట్ల వరకూ ఎవరిని అడగకుండా కొనేయొచ్చు

Update: 2020-07-16 05:30 GMT
కీలక నిర్ణయాలు తీసుకోవటానికి దమ్ము.. ధైర్యం కావాలి. ఆ విషయంలో తనకు టన్నుల లెక్కన ఉందన్న విషయాన్ని తాజా నిర్ణయంతో చెప్పేసింది మోడీ సర్కారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సైన్యానికి అపరిమితమైన అధికారాన్ని తాజాగా కట్టబెట్టింది. సైన్యానికి అవసరమైన ఆయుధాల్ని కొనుగోలు చేసే విషయంలో రూ.300 కోట్ల వరకు డీల్ ను ఎవరి అనుమతులు లేకుండానే నేరుగా కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకున్న పరిమితుల్ని పక్కన పెట్టేసి.. సైన్యం చేసుకునే ఏ డీల్ అయినా రూ.300 కోట్ల వరకు ఉంటే ఎవరినీ అడగకుండానే ఒప్పందాల్ని పూర్తి చేసుకోవచ్చు. అనుమతుల కోసం అటూ ఇటూ తిరగటమే తప్పించి.. పనిలో వేగం పెరగని వేళ.. అలాంటివాటికి చెక్ చెప్పేలా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తాము తీసుకున్న నిర్ణయాన్ని స్వయంగా వెల్లడించారు.

తాజాగా రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశం జరిగింది. దీనికి రాజ్ నాథ్ ప్రాతినిధ్యం వహిచారు. ఈ సందర్భంగా అత్యవసర పనుల నిర్వహణ కోసం ఆయుధాల్ని కొనుగోలు చేయాలంటే రూ.300 కోట్ల వరకు ఎవరిని అడగకుండానే ఖర్చు చేసే అపరిమితమైన అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టేశారు. దీంతో.. ప్రతి డీల్ ప్రాసెస్ కనిష్ఠంగా ఏడాది వరకూ తగ్గనుందని చెప్పాలి.

రూ.300 కోట్ల వరకు కొనుగోలు చేసే డీల్స్ ఏడాదిలో ఇన్ని మాత్రమేనన్న పరిమితులు లేకుండా.. ఎన్నైనా చేసుకోవచ్చన్న విషయాన్ని స్పష్టం చేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. ఆయుధాల కొనుగోళ్ల కోసం విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకునే పరిస్థితిలో మార్పు వస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News