తిరుపతిలో పోటీ చేసేది బీజేపీనే..జనసేన ప్రచారానికి మాత్రమే పరిమితం!

Update: 2020-12-13 05:53 GMT
మిత్రపక్షాల తరపున తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్ధి విషయంసై ఓ కమిటి వేస్తామని నడ్డా చెప్పారు’...పవన్ ప్రకటన.

‘నోటిఫికేషన్ రిలీజ్ అయినపుడు ఏ పార్టీ పోటీ చేస్తుందో అప్పుడు నిర్ణయిస్తాం’.. ఆమధ్య సోమువీర్రాజు ప్రకటన.

పై రెండు ప్రకటనలు చూసినపుడు తొందరలో జరగబోయే తిరుపతి పార్లముంటు ఉపఎన్నికలో బీజేపీ+జనసేనల్లో  ఏపార్టీ పోటీ చేస్తుందో ఇంకా తేలలేదనే అనుకుంటారు. నిజానికి నిజం కూడా అదే. కానీ క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతోంది ? ఏమి జరుగుతోందంటే అభ్యర్ధి పేరుతో కాకుండా బీజేపీ నేతలు తమ ప్రచారాన్ని ప్రారంభించేశారు. ఏపిలో కమలంపార్టీ జైత్రయాత్ర తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలుపు ద్వారా మొదలవ్వబోతోందంటు ప్రకటనలు మొదలుపెట్టేశారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధినే గెలిపించాలంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు.

జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పినట్లు లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్లుగా ఉపఎన్నికలో ఏ పార్టీ పోటీ చేస్తుందో తేలకముందే బీజేపీ అభ్యర్ధినే గెలిపించాలని కమలంపార్టీ నేతలు ఎలా ప్రచారం మొదలుపెట్టేశారు ? బీజేపీ నేతల వ్యూహమంతా చాపకింద నీరులాగ సాగిపోతోంది. పవన్ కల్యాణ్ పై గల్లీ స్ధాయి నుండి ఢిల్లీస్ధాయి నేతలవరకు మైండ్ గేమ్ ఆడుతున్నారు. చివరివరకు పవన్ను డార్క్ లోనే అట్టిపెట్టి చివరి నిముషంలో తమ పార్టీ అభ్యర్ధినే ప్రకటించే వ్యూహంతో  బీజేపీ నేతలు ముందుకెళిపోతున్నారు.

వివిధ అంశాలపై బీజేపీ-జనసేన అగ్రనేతల మధ్య ఇప్పటికి రెండుసార్లు సమావేశం అయినా ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయమై చర్చ జరగకుండా కమలంపార్టీ నేతలు జాగ్రత్తపడ్డారు. కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం బీజేపీ అభ్యర్ధికే ఓట్లు వేయాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కమలంపార్టీ రాష్ట్ర కార్యవర్గంలోని నేతలు సుహాసినీ ఆనంద్, దయాకర్ రెడ్డి, నిర్మలా కిషోర్ లాంటి వాళ్ళు తిరుపతి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం సమావేశాలు నిర్వహించారు. శనివారం తిరుపతిలో మొదలైన రెండురోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు సుహాసిని, నిర్మలా కిషోర్ తిరుపతికి వచ్చారు. అసలు రెండు రోజుల పాటు కార్యవర్గ సమావేశం తిరుపతిలో పెట్టుకోవటం కూడా వ్యూహాత్మకమే.

 వీళ్ళేకాదు మరికొంతమంది నేతలు కూడా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీ అభ్యర్ధినే గెలిపించాలని ప్రచారం చేయటంలో అర్ధమేంటి ? ఇంటర్నల్ గా బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారనే కచ్చితమైన సమాచారం వీళ్ళకు అందకపోతే పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని ప్రచారం చేసే ప్రసక్తేలేదు. పైకేమో ఏ పార్టీ పోటీ చేస్తుందో ఇంకా నిర్ణయం కాలేదని చెప్పటం కేవలం పవన్ను డార్కులో పెట్టటం కోసమే. మరి బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పవన్ కు తెలీకుండానే ఉంటుందా ?

కమలం నేతలు బహిరంగంగానే ప్రచారం చేస్తుంటే ఈ విషయం జనసేనానికి ఎందుకు తెలీదు? తెలుసు, తెలిసినా చేయగలిగేది కూడా ఏమీలేదు. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను పోటీనుండి విత్ డ్రా చేయించి పవన్ తో ప్రచారం చేయిస్తామని చెప్పారు. అయితే చివరకు ప్రచారానికి కూడా పవన్ను దూరంగానే పెట్టేశారు. అప్పుడు పవన్ ఏమి చేయగలిగారు ? తమను కాదని పవన్ చేయగలిగేది ఏమీలేదని బీజేపీ నేతలకు కూడా బాగా తెలుసు. అందుకనే పవన్ను ఆటలో అరిటపండులాగ ట్రీట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా పవన్ కు తెలుసు. తెలిసీ చేయగలిగేదీ ఏమీలేదంతే.
Tags:    

Similar News