16 ఏళ్ల బాలుడు..అమెరికాలో తెలుగోడిని కాల్చిచంపాడు

Update: 2018-11-18 05:19 GMT
అమెరికాలో మళ్లీ తూటాలు పేలాయి. అమెరికాలో రాజ్యమేలుతున్న తుపాకుల సంస్కృతి ఓ తెలుగు బిడ్డ‌ను బలితీసుకుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని వెంట్నార్‌ లో నివసిస్తున్న మెదక్ జిల్లాకు చెందిన సునీల్ ఎడ్ల (61)ని ఓ 16 ఏళ్ల‌ బాలుడు కాల్చి చంపాడు.  తన తల్లి 95వ జన్మదినోత్సవం కోసం భారత్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆయన హత్యకు గురి కావడం దారుణమని సునీల్ బంధువులు వాపోతున్నారు. ఈ నెల 15న అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో సునీల్ తన ఇంటి ఎదురుగానే హత్యకు గురయ్యాడు. అట్లాంటిక్ నగరంలోని ఆతిథ్య పరిశ్రమలో సునీల్ ఆడిటర్‌ గా పనిచేస్తున్నారు. నైట్‌ షిఫ్టుల్లో పనిచేసే సునీల్ ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరిన సమయంలో అక్కడే కాచుకొని కూర్చున్న బాలుడు ఆయనపై కాల్పులు జరిపాడని స్థానిక మీడియా తెలిపింది.

కాల్పులు జరిపిన అనంతరం ఆ బాలుడు సునీల్ కారును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా పోలీసులు శుక్రవారం నాడు నిందితుడైన బాలుడిని అరెస్టు చేశారు. సునీల్ మృతదేహానికి శనివారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. బాలుడు ఈ హత్య ఎందుకు చేశాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రస్తుతం ఆ బాలుడిని ప్రశ్నిస్తున్నారు. మైనర్ కావడం వల్ల అతడి పేరును బయటపెట్టడం లేదని పోలీసులు చెప్పారు. 1987లో అమెరికాకు వెలసపోయిన సునీల్ ఈ నెలాఖరులో భారత్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తన తల్లి పుట్టినరోజు వేడుకతోపాటు క్రిస్మస్ పండుగను స్వదేశంలో జరుపుకొనేందుకు రెండు నెలల ప్రయాణానికి ఆయన సిద్ధమయ్యాడని బంధువులు తెలిపారు. అట్లాంటిక్ నగరంలోని పలు చర్చిలలో పియానో వాయించడం ద్వారా సునీల్ స్థానికులకు సుపరిచితుడని చెప్పారు.



Tags:    

Similar News