వింత వ్యాధితో టీడీపీ వింత రాజకీయం!

Update: 2020-12-14 03:43 GMT
ఏలూరులోని వింతవ్యాధిపై తెలుగుదేశంపార్టీ తనదైన స్టైల్లో వింత రాజకీయం మొదలుపెట్టేసింది. ప్రభుత్వంపై బురద చల్లటానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్న టీడీపీకి చక్కటి అవకాశం వచ్చేసింది. పార్టీ తరపున ఏలూరులో పర్యటించిన ముగ్గురు నేతలు మాజీమంత్రి చినరాజప్ప, ఎంఎల్సీలు రాజేంద్రప్రసాద్, అశోక్ బాబులు విచిత్రమైన డిమాండ్లు, ఆరోపణలు చేస్తున్నారు.

వింతవ్యాధికి ఇంతవరకు మూల కారణం ఏమిటో ? పరిష్కారం ఏమిటో కనుక్కోవటంలో ప్రభుత్వం ఫెయిలైందంటు మండిపడ్డారు. వింతవ్యాదికి కారణం కనుక్కోవాల్సింది, పరిష్కారం చూపాల్సింది ప్రభుత్వం కాదన్న విషయాన్ని వాళ్ళు మరచిపోయారు. వింతవ్యాధికి ఎందుకు వచ్చిందో కనుక్కునేందుకే దాదాపు 14 పరిశోధనా సంస్ధలు కృషి చేస్తున్నాయి. వింతవ్యాధి ఎందువల్ల వచ్చిందో చెప్పాల్సింది శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులే కానీ ప్రభుత్వం కాదు.

ఇక సమస్య ఏమిటో తెలిస్తే కానీ పరిష్కారం సాధ్యంకాదు. పరిపాలనాపరమైన సమస్యలైతే ప్రభుత్వం వెంటనే చక్కదిద్దుకుంటుంది. కానీ ఇక్కడది కాదు సమస్య. సమస్యేమిటో తెలుసుకునేందుకు గడచిన ఎనిమిది రోజులుగా నిపుణులందరూ నానా అవస్తలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఏలూరులో జనాలందరికీ శుద్ధజలాన్ని అందించాలనే డిమాండ్ కూడా విచిత్రమే. ఎందుకంటే ఇపుడున్న మంచినీటి వ్యవస్ధకు ప్రత్యామ్నాయంగా ఒకేసారి నాలుగున్నర లక్షల మందికి శుద్ధజలం అందించాలంటే ఏ ప్రభుత్వం వల్లా కాదు.

ఇక్కడ టీడీపీ నేతలు గుర్తుంచుకోవాల్సిందేమంటే ఇపుడు మంచినీటి వ్యవస్ధయిన, పారిశుధ్య వ్యవస్ధయినా తమహయాం నుండి కంటిన్యు అవుతున్నదే కానీ కొత్తది కాదని. పారిశుద్యాన్ని మెరుగుపరుచాలని డిమాండ్ చేయటంలో తప్పేలేదు. అంతేకానీ రెండు రోజుల్లో తాము చెప్పింది ప్రభుత్వం చేయకపోతే తామే రంగంలోకి దిగాల్సుంటుందనే బెదరింపులొకటి. తమ పార్టీనేతలే రంగంలోకి దిగి పారిశుద్యాన్ని శుభ్రం చేస్తామని బెదిరిస్తున్న టీడీపీ నేతలను ఇఫుడెవరైనా వద్దన్నారా ?

సమస్య వచ్చినంత తొందరగా పరిష్కారం దొరకదన్న చిన్న విషయాన్ని కూడా టీడీపీ నేతలు పట్టించుకోకుండా రాజకీయం చేయటమే విచిత్రం. ఏలూరులో పర్యటించవచ్చు, బాధితులను పారమర్శించటం కూడా తప్పులేదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయం చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. తమ హయాంలో కూడా ఇవే వ్యవస్ధలు పనిచేశాయన్న విషయాన్ని తమ్ముళ్ళు గుర్తుంచుకోవాలి. ఇపుడు ఏలూరులో జరిగిన ఘటనల్లాంటివే తమ హయాంలో కూడా చాలా జరిగాయని మరచిపోతే ఎలాగ ?
Tags:    

Similar News