ఎన్డీఏ నుంచి బాబు వైదొలిగేది ఎప్పుడో తేలింది

Update: 2016-05-07 11:30 GMT
ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర ప్ర‌భుత్వం తేల్చిచెప్పిన నేప‌థ్యంలో బీజేపీ-టీడీపీల మ‌ధ్య పొరాపొచ్చాలు మొద‌ల‌వుతున్నాయి. బీజేపీని త‌ప్పుప‌డుతూ అధికార టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో క‌మ‌ళ‌నాథులు సైతం త‌మ ఢిల్లీ పెద్ద‌ల‌కు మ‌ద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ-టీడీపీ మితృత్వంపై తాజాగా కొత్త అంచ‌నాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

లోక్‌ సభలో బడ్జెట్‌ పై జరిగిన చర్చలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  పాల్గొంటూ ఎన్‌ డీఏ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ తీరును పార్ల‌మెంటు వేదిక‌గా తూర్పార ప‌ట్ట‌డం బీజేపీలో చర్చనీయాంశమైంది. ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్రబాబు సలహా మేరకే జయదేవ్ ఎన్‌ డీఏపై విరుచుకుపడి ఉంటారని బీజేపీ జాతీయ నాయకులు భావిస్తున్నట్లుగా రాజ‌కీయ‌వ‌ర్గాలు చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీపై బీజేపీ నేత‌లు కొత్త చ‌ర్చ‌ను తెర‌మీద‌కు తెచ్చారు.

 ‘తెలుగుదేశం అధినాయకత్వం 2018 వరకు బీజేపీతో కలిసి ఉంటుంది. లోక్‌ సభ - అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటుంది’అని బీజేపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. బీజేపీతో ఇప్పుడిప్పుడే సంబంధాలు తెంచుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందదనేది ముఖ్యమంత్రికి బాగా తెలుసునని వారంటున్నారు. అందుకే 2018 వరకు కేంద్రం నుంచి తీసుకోవలసిన అర్థిక సహాయాన్నంతా తీసుకుంటారని వారు ఘంటా ప‌థంగా చెప్తున్నారు.
Tags:    

Similar News