అలుపెరగని యాత్రపై టీడీపీ ఆందోళన

Update: 2018-11-06 09:54 GMT
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పురుడుపోసుకుని సరిగ్గా ఏడాదైంది. ఇడుపులపాయలో పడిన తొలి అడుగు అనేక జిల్లాలను దాటుకుంటూ విజయనగరం గడ్డ పైకి వచ్చింది. జగన్‌ అడుగుల్లో కొన్ని లక్షల అడుగులు జత కలిసి నడిచాయి. వేల సమస్యలు ప్రజల గొంతుల్లో వేదనై కన్నీళ్లు కార్చాయి.. తెలుగుదేశం పార్టీ అవినీతి - అక్రమాలపై జగన్‌ ప్రసంగాలు రణనినాదమై మార్మోగాయి.. ఆసాంతం ప్రజలతో మమేకమైన యాత్ర.. అలుపెరగక - వెనుదిరక ముందుకు సాగింది. ఈ ఏడాది కాలంలో ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులతో గడిపిన రోజులు వేళ్ల మీద లెక్కించవచ్చు. ఎక్కువ సమయం ప్రజల మధ్య - ప్రజలతో గడిపారు.. అదే సమయంలో రాజకీయ సమీకరణాలపై లెక్కలేశారు. గత ఎన్నికల్లో పొరపాట్లపై సమీక్షించారు. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట - గుంటూరు పశ్చిమ వంటి నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా మార్చారు. ఇలా ప్రతి అడుగులోనూ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.

కత్తి కట్టారు..

విజయవంతంగా సాగిపోతున్న యాత్రకు కాస్తంత విఘాతం కలిగింది. గత నెల 25వ తేదీన విశాఖలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి జగన్‌ పై కోడి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై చంద్రబాబు వ్యవహరించిన తీరు.. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది. హత్యాయత్నం ఘటనపై విచారణ పూర్తి కాకుండానే.. ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. అనే అంశాలపై సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర డీజీపీ ఒక నిర్ణయానికి వచ్చి జగన్‌ అభిమాని దాడిగా నిర్ధారించారు. ఇక ఆ తర్వాత విచారణంతా తూతూమంత్రమేనని వాళ్లే తేల్చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు వ్యవహరించిన తీరు చూసిన చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఏ అంశం మీద నైనా ఆచీతూచీ వ్యవహరించే బాబుకు ఇప్పుడేమైందో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి.. కొంత ఆత్మరక్షణలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సీపీఎస్‌ (కంటిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌) విధానంపై చంద్రబాబు మౌనం వహిస్తే.. జగన్‌ స్పష్టమైన హామీ ఇవ్వడం.. మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుల పొట్టగొట్టే 279 జీవోపై సమాధానం చెప్పకపోవడం.. అదే సమయంలో ఈ జీవోను జగన్‌ రద్దు చేస్తానని చెప్పడం.. అగ్రి గోల్డ్‌ ఆస్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి కారణంగానే ఇబ్బందులొస్తున్నాయని బాధితులు భావించడం.. ఇలా అనేక అంశాల్లో చంద్రబాబు ఇరుకున పడ్డారని రాజకీయ పండితులు అంటున్నారు.

ఈయన జనంలో.. ఆయన విదేశాల్లో..

ఈ ఏడాది కాలంలో ప్రతి పక్ష నేత జనంలోనే ఎక్కువగా ఉండడం జగన్‌ కు కలిసొస్తే.. అదే సమయంలో రాజధాని నిర్మాణ నమూనాలు - విదేశీ పెట్టుబడులంటూ చంద్రబాబు విదేశాలు పట్టుకుని తిరగడం ప్రజల్లో కొంత అసంతృప్తి మిగిల్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. మరో వైపు రాజధాని అమరావతిలో నమూనాలు మినహా నిర్మాణాలు లేకపోవడం.. తమ పాలనపై వ్యతిరేకత ఉందనే విషయం చంద్రబాబుకు అర్థమైందని.. అందుకే చిన్న విషయంలోనూ ఎక్కువగా స్పందిస్తున్నారని - జగన్‌ పై హత్యాయత్నం ఘటనపైనా అర్థంలేని వ్యాఖ్యలతో అభాసుపాలయ్యారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News