సైకిల్ తొక్కుతూ.. రోడ్డు పక్కన టీ తాగటం.. ఇవన్నీ సీఎం స్టాలిన్ కే సాధ్యం

Update: 2021-09-26 04:39 GMT
రాజకీయం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అందునా తమిళనాడు రాజకీయం గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అధికారం చేతిలో ఉంటే.. ప్రత్యర్థుల పీచమణచటం మినహా మరింకేమీ పని లేనట్లుగా వ్యవహరించే అక్కడి అధినేతల తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా సాగిన కరుణ - జయలలిత పోరు.. అదెలాంటి పరిణామాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీఎం స్టాలిన్.. సరికొత్త రాజకీయాన్ని తమిళులకే కాదు.. దేశ ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

ఊహించని రీతిలో వ్యవహరించటమే కాదు.. పొగడ్తలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాజకీయాల్లో అలాంటి తీరుకు చెక్ పెట్టేలా.. తనను పొగిడే సొంత పార్టీ నేతలపై సీరియస్ కావటం ద్వారా సంచలనంగా మారారు. అంతేకాదు.. విపక్షాల్ని కలుపుకెళ్లటం.. కొన్ని సందర్భాల్లో వారందరికి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న ఆయన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్నింటికి మించి ముఖ్యమంత్రి అన్నట్లు కాకుండా.. మీలో ఒకడిని అన్న భావన కలిగేలా ఆయన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

సింఫుల్ గా ఉండటం.. ప్రచార హడావుడి చేయకుండా.. ఇప్పటివరకు తమిళులు చూడని సరికొత్త రాజకీయాన్నిఆయన పరిచయం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యవహరించిన తీరు ఆయన్ను వార్తల్లోకి తీసుకొచ్చింది. సీఎం స్టాలిన్ కు జాగింగ్ చేయటం.. సైక్లింగ్ చేయటం చాలా ఇష్టం. ఫిట్ నెస్ కు ఆయన అమితమైన ప్రాధాన్యతను ఇస్తుంటారు. జులై నాలుగున ముట్టుక్కాడు నుంచి మహాబలిపురం వరకు సైకిల్ మీద ప్రయాణించిన వైనం తెలిసిందే.

తాజాగా చెన్నైలోని ఈసీఆర్ వద్ద సైకిల్ తొక్కిన ఆయన.. తనను గుర్తు పట్టిన స్థానికుల్ని ఆయన పలుకరించారు. మహాబలిపురంలోని ఒక దుకాణంలో టీ తాగి.. అక్కడి వారితో ముచ్చటించి.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్న సీఎం స్టాలిన్ తీరు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చగా మారింది. ఇలాంటివన్నీ స్టాలిన్ మాత్రమే చేయగలరన్న భావన కలిగేలా ఆయన చేస్తున్నారు.
Tags:    

Similar News