తెలంగాణకు స్వైన్ ఫ్లూ బెడద షురూ

Update: 2015-11-26 04:06 GMT
వాతావరణం ఏ మాత్రం చల్లబడినా సరికొత్త భయం ఒకటి వచ్చేసే పరిస్థితి. చలికాలంలో విరుచుకుపడే స్వైన్ ఫ్లూ మళ్లీ తన రెక్కలు విప్పుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. స్వైన్ ఫ్లూ మీద సర్కారు ఎన్ని మాటలు చెప్పినా.. దాన్ని నిలువరించే విషయంలో మాత్రం విజయవంతం కాలేకపోతోంది. కొద్ది నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసుల నమోదు రోజురోజుకీ పెరుగుతోంది.

ఆగస్టు నుంచి ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో 3590 మందికి స్వైన్ ప్లూ రక్తపరీక్షలు జరిపితే.. ఇందులో 556 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 17 మంది మరణించారు. గత కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం.. చల్లదనం పెరిగిన నేపథ్యంలో స్వైన్ ప్లూ వ్యాప్తికి అవకాశాలు మరింత పెరగనున్నాయి. రానున్నా నాలుగు నెలలు చల్లదనం అధికంగా ఉంటే అవకాశం ఉన్న నేపథ్యంలో స్వైన్ ప్లూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు.. సినిమా థియేటర్లు.. ఆసుపత్రులు.. ఇలా ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందో అక్కడ స్వైన్ ప్లూ బెడద ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అందుకే..వీలైనంత వరకూ స్వైన్ ప్లూ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం.. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గు.. జలుబు.. తలనొప్పి.. ఒళ్లునొప్పులు లాంటివి ఎక్కువగా ఉంటే వెనువెంటనే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవటం చాలా ముఖ్యం. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైన పక్షంలో ఇంట్లో వారికి కాస్త దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చల్లటి రోజుల్లో చెలరేగిపోయే స్వైన్ ప్లూకు వీలైనంత దూరంగా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News