కేసీఆర్ తరఫున స్వామీజీ దుమ్ముదులిపేశారు

Update: 2017-02-23 13:35 GMT
తెలంగాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తిరుమల శ్రీవారికి దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల విలువైన ఆభరణాల్ని ప్రభుత్వ సొమ్ముతో సమర్పించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేసీఆర్ కానీ.. టీఆర్ ఎస్ మంత్రులు కూడా ఏమీ స్పందించలేదు. ఆశ్చర్యకరంగా ఒక స్వామీజీ కేసీఆర్ తరఫున మాట్లాడారు. కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్న వారికి దీటుగా సమాధానం చెప్పారు. ఆయనెవరో కాదు.. కాకినాడ శ్రీ పీఠాన్ని నడిపించే పరిపూర్ణానంద సరస్వతి. కేసీఆర్ మీద విమర్శలు గుప్పించిన సీపీఎం నేత రాఘవులుతో పాటు అందరి మీదా స్వామీజీ మండిపడ్డారు.

హిందూ మతం పైన నమ్మకం లేని రాఘవులుకు కేసీఆర్ మొక్కుల చెల్లింపుపై మాట్లాడే అర్హత లేదని పరిపూర్ణానంద విమర్శించారు. హిందువుల దేవుడికి మొక్కు తీర్చిన సొమ్మే ప్రజల సొమ్మా అని ఆయన ప్రశ్నించారు. రాఘవులుకు దమ్ము ఉంటే ఇతర మతాల వ్యవహారాల పైన కూడా మాట్లాడాలని ఆయన సవాలు చేశారు. జెరూసలేం.. మక్కా యాత్రలకు ఇస్తోంది ప్రజల సొమ్ము కాదా.. మరి దానిపై మాట్లాడరేంటని పరిపూర్ణానంద ప్రశ్నించారు. హిందువులు మాత్రమే దేవాదాయ శాఖ తరఫున ప్రభుత్వాలకు పకప్పం కడుతున్నారని.. మరే మతస్థులు కూడా ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదని.. అలాంటపుడు ప్రభుత్వం తరఫున కేసీఆర్ దేవుడికి మొక్కులు చెల్లిస్తే.. అవి దేవుడికి వెళ్తే అభ్యంతరం ఏంటని పరిపూర్ణానంద అన్నారు. మరి స్వామీజీ విమర్శలపై రాఘవులు.. ఇతర నాయకులు ఏమని స్పందిస్తారో? ఆయన అడిగినట్లు ఇతర మతాలకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా ప్రశ్నిస్తారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News