తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జిగా మాజీ గవర్నర్

Update: 2017-07-23 05:43 GMT
ఆంధ్రప్రదేశ్ పై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం ఏదైనా అద్భుతం జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని అనుకుంటోంది. అందుకే... వ్యూహాత్మకంగా వెళ్లి ఫలితం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా తెలంగాణకు కొత్త ఇంఛార్జిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.  ఇక్కడి పరిస్థితులు బాగా తెలిసి ఉండి.. ఇక్కడి నేతలతో మంచి సంబంధాలున్న సీనియర్ లీడర్ ను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి - ఉమ్మడి రాష్ట్ర మాజీ గవర్నర్‌ సుశీల్‌ కుమార్‌ షిండేను నియమించాలని ఎఐసీసీ నిర్ణయించి నట్లు తెలిసింది.
    
షిండే  నియామకంపై ఒక ట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా షిండేకు ముందుగా బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత తెలంగాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంచార్జీగా మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ ఉన్నారు. గడచిన మూడేళ్లుగా ఆయన ఇంచార్జీగా ఉన్నారు. గతంలో ఒకసారి కూడా ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంతో ఉన్న ఎఐసీసీ షిండేకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. డిగ్గీరాజా బాగా పని చేసినప్పటికీ మూడేళ్ల పదవీ కాలం పూర్తయినందున ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ నిర్ణయించింది.
    
షిండేకు ఇక్కడ గవర్నర్‌ గా పని చేసిన అనుభవం ఉండడం, పార్టీ నేతలతో విస్తృత స్థాయిలో పరిచయాలు తోడుకావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే వ్యూహరచన చేయగలడని భావించి ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీగా నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఆయనకు తెలంగాణపై పూర్తి అవగాహన ఉండడంతో పాటు మహారాష్ట్రలో నివాసమున్న తెలంగాణ వాసులతో విస్తృతంగా పరిచయాలు కూడా ఉండడం ఆయన నియామకానికి కారణంగా చెబుతున్నారు.
Tags:    

Similar News