సుమలత ఆస్తులు.. అప్పుల చిట్టా ఇదీ

Update: 2019-03-21 06:55 GMT
కర్ణాటక రెబల్ స్టార్ దివంగత అంబరీష్ సతీమణి సుమలత కర్ణాటకలోని మాండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే..  బుధవారమే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించిన అఫిడవిట్ లో సుమలత తన ఆస్తుల విలువ రూ.23 కోట్లకు పైగా ఉందని.. రుణాలు ఉన్నాయని పేర్కొంది.

నామినేషన్ పత్రాలు దాఖలు తర్వాత సుమలత వెంట చాలెంజింగ్ స్టార్ దర్శన్ - కేజీఎఫ్ హీరో యష్ - వేల సంఖ్యలో అభిమానుల సమక్షంలో మాండ్యాలోని వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సుమలత పాల్గొని మాట్లాడారు.

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ది మాండ్యా జిల్లా మళవల్లి అని..తాను హుచ్చే గౌడ కోడలునని సుమలత పేర్కొంది. రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి - అభిషేక్ తల్లినని అన్నారు. తాను పేరు ప్రతిష్టల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని.. తనకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందని సమలత పేర్కొంది. మాండ్యా జిల్లా ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సుమలత పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా అంబరీష్ ను ఆదరించారని.. ఆయన లేని లోటును మీరు భర్తీ చేయాలని కోరితేనే తాను బరిలోకి దిగానని సుమలత స్పష్టం చేశారు.

*సుమలత బయోడేటా

పేరు: సుమలత అమరనాథ్ అలియాస్ సుమలత అంబరీష్
భర్త పేరు : దివంగత ఎంహెచ్ అమరనాథ్ అలియాస్ అంబరీష్
కుమారుడు : అభిషేక్ గౌడ
చిరునామా : బెంగళూరు - జేపీనగర్ 2వ స్టేజ్ - 21వ మెయిన్ రోడ్డు
ఎలాంటి క్రిమినల్ కేసులు సుమలతపై లేవు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోని సంతేష్ జోసఫ్ కాన్వెంట్ స్కూల్లో 1977-78 సంవత్సరంలో 10వ తరగతి వరకు చదివారు.

*స్థిరాస్తి రూ.17 కోట్లకు పైగానే

* సుమలత స్థిరాస్థి 17కోట్ల 72 లక్షలు. ఇందులో 41 లక్షల విలువైన వ్యవసాయ భూమి . బెంగళూరులోని జేపీ నగర్ లో సొంత ఇల్లు - భవనం విలువ 17లక్షల72 వేలు. ఇక ఐటీ రిటర్న్స్ లో ఆర్థిక ఆదాయం 1కోటి 33 లక్షలుగా చూపించారు.

* అప్పుల వివరాలు

సుమలత మొత్తం అప్పులు కోటి 42 లక్షలుగా పేర్కొన్నారు. ప్రమీళ అనే మహిళ దగ్గర రూ.45 లక్షల రుణం తీసుకున్నట్టు పేర్కొన్నారు. సంతోష్ డీటీ అనే వ్యక్తి దగ్గర రూ.95 లక్షలు రుణం తీసుకున్నట్టు తెలిపింది. సెక్యూరిటీ బాండ్ లేకుండా రూ.2 లక్షల 32వేలు. బ్యాంకులు - ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదని సుమలత పేర్కొంది.


Tags:    

Similar News