సుజనా సన్నాయి నొక్కులు విన్నారా?

Update: 2019-11-22 04:24 GMT
మాటలతో ప్రత్యర్థుల మనసుల్ని ప్రభావితం చేయటం.. మైండ్ గేమ్ ఆడటం లాంటివి రాజకీయాల్లో మామూలే. రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి లాంటి వారికి టాస్కులు అప్పజెప్పితే ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా తనకున్న టాలెంట్ ను టన్నుల లెక్కన ప్రదర్శించి.. రానున్న రోజుల్లో తనకున్న రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించేందుకు కిందామీదా పడుతున్న ఆయన.. తనకొచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలటం లేదు.

అటు తెలంగాణలోనూ.. ఇటు ఆంధ్రాలోనూ వైరి పక్షానికి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ తరచూ ఆయన నోట వస్తున్న మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఏపీ అధికారపక్షానికి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఎంతమంది అంటే మాత్రం.. పలువురు అంటూ చెప్పిన సుజనా.. విపక్ష టీడీపీకి సంబంధించి టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల ఫిగర్ ను చెప్పటం గమనార్హం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు చెప్పటం ద్వారా స్పష్టమైన మైండ్ గేమ్ ను ప్రదర్శించిన సుజనా.. బాబు పార్టీ వరకూ వచ్చేసరికి.. తన మాజీ బాస్ కు నిద్ర పట్టని రీతిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాదు.. ఏకంగా ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు చెప్పారు.

ఇప్పటికిప్పుడు వారిని పార్టీలో చేర్చుకునే ఆలోచన తమకు లేదని.. సమయం.. సందర్భం వచ్చినంతనే వారిని పార్టీలో చేర్చుకుంటామన్నారు. ఇన్ని మాటలు చెబుతున్నారు కదా? టచ్ లో ఉన్న ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఎవరో? అన్న ప్రశ్నను వేసినప్పుడు మాత్రం.. ఇప్పటికిప్పుడు అలా చెప్పలేనని.. ఆ మాటకు వస్తే దాని సమాధానం అప్రస్తుతంగా తేల్చేశారు.

టచ్ లో ఉన్న నేతల ఫిగర్  చెప్పటం ఇప్పుడు సాధ్యం కాదన్న సుజనా.. అలాంటిదొకటి ఉందన్న విషయాన్ని మాత్రం ఎందుకు చెప్పటమన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పరు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల బీజేపీ నేతలతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఆయన ఎవరితో మాట్లాడారో తనకు తెలీదని.. ఎవరి టచ్ లో ఉన్నారో కూడా తెలీదన్నారు. ఏపీలో రాజ్యాధికారం దిశగా తాము పయనిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో అది సాధ్యమన్న భరోసాను వ్యక్తం చేశారు. నిజమే.. ఉన్న పార్టీ ఫ్యూచర్ గురించి ఆ మాత్రం ఆశ లేకుంటే సుజనాలాంటోళ్లకు రాజకీయ బతుకుదెరువు ఏముంటుంది చెప్పండి?
Tags:    

Similar News