మోడీ సర్కారును కూలదోస్తానన్న బీజేపీ ఎంపీ

Update: 2018-12-09 17:48 GMT
భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఎవరి వైపు నిలుస్తాడో అర్థం కాదు. కొన్నిసార్లు స్వపక్షం.. విపక్షం అని తేడా చూడడాయన. ఎవ్వరిమీదైనా తనదైన శైలిలో విరుచుకుపడుతుంటాడు. ఇన్నాళ్లూ ఆయన కాంగ్రెస్ నేతల్ని ఒక ఆట ఆడుకున్నాడు. తాజాగా ఆయన సొంత పార్టీ మీదే విమర్శలు ఎక్కుపెట్టాడు. ఇచ్చిన హామీని నెరవేర్చని మోడీ సర్కారును కూలదోస్తానని ఆయన తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అయోధ్యలో రామ మందిరానికి అత్యంత అనుకూల పరిస్థితులున్నా కూడా ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు కూడా అభ్యతరం లేదనీ.. అయినా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్‌.. యూపిలోని యోగి ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఇలాగే ఏవేవో కారణాలు చెప్పి రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సొంత ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు వెనకాడనని ఆయన హెచ్చరించారు. వచ్చే జనవరి తర్వాత అయోధ్య కేసును విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    
    
    

Tags:    

Similar News