దానిని హైదరాబాద్ స్నేక్ మ్యూజియం అనాలేమో

Update: 2015-12-15 05:13 GMT
మరో మూడు రోజుల్లో దేశ ప్రధమ పౌరుడు వచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన బస చేసే చోట గాలింపులు జరిపితే.. ఏకంగా యాభై పాములు దొరకటం ఆశ్చర్యంగా మారింది. ఏడాదికి ఒకసారి వేసవి విడిది కోసం హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రావటం తెలిసిందే. అదే తీరులో ఈ వేసవి విడిదికి వచ్చిన రాష్ట్రపతి ఈ ఏడాది మరోసారి రావటం విశేషం. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇలా ఒకే ఏడాదిలో రెండుసార్లు బొల్లారానికి విడిదికి వచ్చిన ఘనత ప్రణబ్ కు దక్కనుంది.

గతంలో ఏడాదికి రెండుసార్లు రాష్ట్రపతి వచ్చినా.. భద్రతా కారణాలతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే రావటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని బ్రేక్ చేస్తూ.. తాజాగా మరో మూడు రోజుల్లో (డిసెంబరు 18) ఆయన బొల్లారం రానున్నారు. శీతాకాల విడిది కోసం శుక్రవారం వస్తున్నప్రణబ్ దా ఈ నెల 31 వరకూ ఇక్కడే ఉండనున్నారు. రాష్ట్రపతి వస్తున్ననేపథ్యంలో.. రాష్ట్రపతి భవన్ కు కొత్త సొగసులు అద్దుతున్నారు. ఈ క్రమంలో పెరిగిపోయిన పొదల్ని తొలగించే ప్రయత్నంలో దాదాపు 50కి పైగా పాముల్ని పట్టుకొని జూ అధికారులకు అప్పగించారు.

వీటితో పాటు పెద్ద ఎత్తున కోతుల్ని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అందించారు. జీహెచ్ ఎంసీ.. జలమండలి మొదలుకొని దాదాపు 25 శాఖలకు చెందిన సిబ్బంది రాష్ట్రపతి భవన్ పనుల కోసం శ్రమిస్తున్నారు. రాష్ట్రపతి రావటానికి మూడు రోజుల ముందే ఇంత భారీ సంఖ్యలో పాములు దొరకటం కాస్తంత ఆందోళన కలిగించే విషయమే. రాష్ట్రపతి రానున్న మూడు రోజుల్లోనూ పాముల కోసం గాలింపు చర్యలు చేపడతారని చెబుతున్నారు.
Tags:    

Similar News