ఏపీలో ఇక ఆకాశం నుంచి నిఘా

Update: 2017-04-10 17:02 GMT
భద్రతా కారణాల రీత్యా నిఘా పెంచడమన్నది ప్రభుత్వాలకు సాధారణమైపోయింది. అందులోనూ చంద్రబాబు వంటి అతి జాగ్రత్తపరులైన సీఎంలు ఉన్నచోట ఇది మరింత ఎక్కువగా ఉంది. సాధారణ భద్రత చర్యలతో పాటు తమ హైటెక్ నాలెడ్జితో అంతర్జాతీయ స్థాయి నిఘా పరికరాలను తీసుకొస్తున్నారు. తాజాగా ఏపీలో అలాంటిదే ఒకటి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇజ్రాయేల్‌లో రూపొందించిన స్కై స్టార్‌- 180 ఏరోస్టాట్‌ అనే నూతన నిఘా వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
    
ఒకేసారి వెయ్యి అడుగుల ప్రాంతాన్ని 360 డిగ్రీల కోణంలో ఇన్‌ ఫ్రారెడ్‌ కిరణాలు - సెన్సార్ల సహాయంతో కెమెరాలో బంధించగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. చిన్న రవాణా వాహనంలో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఈ నిఘా పరికరం హీలియంతో పని చేస్తుంది. ఏకధాటిగా 72 గంటలు పని చేస్తుంది. కేవలం ఇద్దరు సుశిక్షితులైన సిబ్బంది దీన్ని రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆపరేట్‌ చేయొచ్చు.  నేల మీదా, సముద్రపైనా దీనిని వినియోగించుకునే వెసులుబాటుంది. ఆటోమేటిక్‌ స్కానింగ్‌తో పాటు రియల్‌ టైమ్‌ లో కచ్చితమైన సమాచారాన్ని వ్యవస్థ చేరవేయగల్గుతుంది. ఇజ్రాయేల్‌ లో తయారైన ఈ పరికరాలను ఇప్పటికే అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ లో విజయవంతంగా వినియోగించినట్లు చెబుతున్నారు.

ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఎఒబి) సహా రాష్ట్రంలోని వివిధ మావో ప్రభావిత ప్రాంతాల్లో ఈ నిఘా వ్యవస్థను ఉపయోగించే అవకాశం ఉందంటున్నారు. ఇంతవరకు దేశంలోనే ఇలాంటి వ్యవస్థ లేదని తెలుస్తోంది. గంజాయి సాగు - ఎర్ర చందనం స్మగ్లింగ్‌ వంటి వాటిని మరింత సమర్థవంతంగా ఈ వ్యవస్థతో అడ్డుకునే వీలుందంటున్నారు. భారీ ట్రాఫిక్‌ జామ్‌ లు ఏర్పడినప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించే ఏర్పాటుకూ ఈ వ్యవస్థ ఇచ్చే సమాచారం వినియోగపడుతుందంటున్నారు.
    
బంద్‌ లు - ఆందోళనలు - నిరసనలు - ర్యాలీలు - రాజకీయ సభలు - ఉద్యమాలు జరిగే సమయాల్లోనూ ఈ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయి నిఘా వేయడానికి, ప్రతిపక్షాలను మరింత కట్టడి చేయడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. వేసవిలో కార్చిచ్చుతో అనుకోకుండా అడవులు దగ్ధమైపోయే సమయంలో ఈ వ్యవస్థ సహాయంతో యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్స్‌లో స్కై స్టార్‌ 180 ఏరోస్టాట్‌లను విదేశాల్లో వినియోగిస్తున్నారు.

స్కై స్టార్‌ 180 ఏరోస్టాట్‌ నిఘా వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు డిజిపి ఎన్‌ సాంబశివరావు, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఏబి వెంకటేశ్వరరావు, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ బిఎన్‌ ఎన్‌ మూర్తి ప్రసుతం ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్నారు. నిఘా వ్యవస్థ పనితీరు, రాష్ట్రంలో ఏ విధంగా వినియోగించవచ్చో ఈ అధికారులు పరిశీలిస్తోన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News