వైఎస్సార్సీపీలోకి మాజీమంత్రి శిద్దా: జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరిక‌

Update: 2020-06-10 17:14 GMT
ప్రకాశం జిల్లాకు చెందిన‌ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలో ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్‌ పార్టీలో చేశారు. కండువా కప్పి జ‌గ‌న్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బుధ‌వారం ఉద‌యం టీడీపీకి రాజీనామా చేసిన ఆయ‌న మ‌ధ్యాహ్నంలోపు అధికార పార్టీలో చేరిపోయారు.

ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాన‌ని, త‌న‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డంపై సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆ ప‌థ‌కాల‌తో పేద, మధ్య తరగతి ప్రజలు అనేకమంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారని పేర్కొన్నారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాల‌ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో శిద్దా రాఘ‌వ‌రావు అట‌వీ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో ఒంగోలు లోక్‌స‌భ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఆయ‌న ఏడాది త‌ర్వాత వైఎస్సార్సీపీలో చేర‌డం విశేషం.
Tags:    

Similar News