సిద్ధూకు చెక్‌.. పార్టీకి షాక్‌

Update: 2021-12-29 10:30 GMT
పంజాబ్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితులు మ‌రింత వేడిగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించాల‌ని చూస్తున్న అధికార కాంగ్రెస్‌కు ప‌రిస్థితులు రోజురోజుకూ సంక్లిష్టంగా త‌యార‌వుతున్నాయి. ఇటు సొంత పార్టీలో క‌ల‌హాలు.. అటు ప్ర‌త్య‌ర్థుల‌ నుంచి స‌వాళ్లు.. ఇలా కాంగ్రెస్ పంజాబ్‌లో గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొనేలా క‌నిపిస్తోంది. అయితే ఈ ప‌రిస్థితులు మెరుగ‌ప‌ర్చుకునేందుకు తాజాగా అధిస్ఠానం రంగంలోకి దిగింద‌ని స‌మాచారం.

ఆ ఆదేశాలు.. పీసీసీ అధ్య‌క్షుడిగా న‌వ‌జ్యోత్‌ సింగ్ సిద్ధూ నియామ‌కం అయిన‌ప్ప‌టి నుంచి అప్ప‌టి ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌తో విభేదాలు తార‌స్థాయికి చేరాయి. దీంతో అమ‌రీంద‌ర్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది. అప్పుడు సిద్దూ సీఎం అవుతార‌ని అనుకున్నా ఆయ‌న్ని కాద‌ని ద‌ళిత నేత చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీని అధిష్ఠానం కూర్చీపై కూర్చొబెట్టింది. కానీ ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ పీసీసీ ప‌ద‌వికి సిద్ధూ రాజీనామా చేయ‌డం.. హైకమాండ్ రంగంలోకి దిగి స‌ర్దిచెప్ప‌డం జ‌రిగిపోయింది.

కానీ సిద్ధూ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే ముఖ్య‌మంత్రిని అని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఈ విష‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన అధిష్టానం సిద్ధూ దూకుడుకు చెక్ పెట్టింది. ఇప్పుడే పంజాబ్‌లో సీఎం అభ్య‌ర్థి పేరు ప్ర‌క‌టించ‌రాద‌ని రాష్ట్ర శాఖ‌ను ఆదేశాలు జారీ చేసింది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మ‌ష్టిగా ప‌నిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌ని స్ప‌ష్టం చేసింది.

సిద్ధూ తానే సీఎం అభ్య‌ర్థిని అని చెప్పుకోవ‌డంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌నూ ఆయ‌నే సొంతంగా ఎంపిక చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక ఎన్నిక‌ల క‌మిటీ ఎందుక‌ని సీనియ‌ర్ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే హైక‌మాండ్ రంగంలోకి దిగింది.

పార్టీకి షాక్‌.. సొంత పార్టీలో స‌మ‌స్య‌ల‌ను ఒక్కొక్క‌టిగా చ‌క్క‌దిద్దుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్‌కు పంజాబ్‌లో తాజాగా షాక్ త‌గిలింది. ఆ పార్టీ ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఫ‌తేజంగ్ సింగ్‌, జ‌ల్వింద‌ర్ సింగ్ క‌లిసి హ‌స్తానికే హ్యాండ్ ఇచ్చారు. ఇప్ప‌టికే మ‌రో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మిత్ సింగ్ సోది కూడా బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు మాజీ ఎంపీ రాజ్‌దేవ్ సింగ్‌, మాజీ ఎమ్మెల్యే గుర్జిత్ సింగ్‌, క్రికెట‌ర్ దినేశ్ మోంగియా కూడా బీజేపీలో చేరారు. ఇప్ప‌టికే పంజాబ్‌లో పాగా వేసేందుకు ఆప్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు కొత్త పార్టీ పెట్టిన అమ‌రీంద‌ర్ సింగ్ బీజేపీతో చేతులు క‌లిపేందుకు చూస్తున్నారు. ఇంకో వైపు రైతు సంఘాలు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఇలా అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ తీవ్ర పోటీ ఎదుర్కొంటుంది.


Tags:    

Similar News