సగానికి పడిపోయిన బ్రహ్మోస్ ఉత్పత్తి..! నిపుణుల బదిలీల ఎఫెక్టేనా?
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణుల గురించి మాట్లాడాలనుకుంటే బ్రహ్మోస్ నుంచే మొదలు పెట్టాలి.;
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణుల గురించి మాట్లాడాలనుకుంటే బ్రహ్మోస్ నుంచే మొదలు పెట్టాలి. భారత్ అత్యంత శక్తివంతమైన, గర్వకారణమైన క్షిపణి ఇది. ఈ క్షిపణి ప్రాజెక్టులో అంతర్గత సంక్షోభం నెలకొనడం దేశ రక్షణ రంగానికి ఒక ‘బిగ్ షాక్’ అనే చెప్పాలి. ఒక వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ కేవలం సాంకేతికతపైనే కాదు.. దానిని రూపొందించే నిపుణుల అనుభవంపై కూడా ఆధారపడుతుంది. అలాంటి క్షిపణి తయారీ ఒక్కసారిగా సగానికి పైగా పడిపోవడం కొంత కలత చెందిస్తోంది. హైదరాబాద్, నాగ్‌పూర్ వంటి కీలక కేంద్రాల నుంచి అనుభవజ్ఞులైన టెక్నీషియన్లను ఒక్కసారిగా బదిలీ చేయడం వల్ల క్షిపణి ఉత్పత్తి 50 శాతం పడిపోవడం సాధారణ పారిశ్రామిక లోపం కాదు.. అది ఒక జాతీయ భద్రతా సమస్య.
భారతదేశ రక్షణ దౌత్యంలో ‘బ్రహ్మోస్’ ఒక బ్రాండ్ అని గర్వంగా చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆయుధం ఇప్పుడు 'స్వయంకృత అపరాధం' వల్ల సంక్షోభంలో పడింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్‌లోని ప్రధాన అసెంబ్లీ లైన్లలో పనిచేసే 56 మంది కీలక నిపుణులను హఠాత్తుగా లక్నో, పిలాని వంటి కొత్త కేంద్రాలకు బదిలీ చేయడం వల్ల ఉత్పత్తి ప్రక్రియ అస్తవ్యస్తమైంది. ఏప్రిల్, 2026 నాటికి నివేదించిన ఈ పరిణామాలు, హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవాలని చూస్తున్న భారత నావికాదళానికి పెద్ద అడ్డంకిగా మారాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిపుణుల బదిలీ ఎందుకు?
క్షిపణి తయారీ అనేది సాదాసీదా యంత్రాల ఉత్పత్తి కాదు. దీనికి ‘మైక్రో-లెవల్’ ఖచ్చితత్వం అవసరం. ఒక మాస్టర్ టెక్నీషియన్ తన దశాబ్దాల అనుభవంతో క్షిపణిలోని సీకర్ ఇంటిగ్రేషన్ లేదంటే ప్రొపెల్షన్ అలైన్‌మెంట్‌ను సరిచేస్తాడు. వారిని ఒక్కసారిగా తొలగించి కొత్తవారిని నియమించడం వల్ల ఇబ్బదులు కలుగుతాయి. ఈ బదిలీలను సిబ్బంది 'వేధింపులు'గా భావించడం, పని ఒత్తిడి వల్ల ప్రాణనష్టం జరగడం వంటి వార్తలు సంస్థలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. అత్యున్నత స్థాయి ఇంజినీర్లు రాజీనామాలు చేయడం మొదలుపెడితే, ఆ నైపుణ్యాలను తిరిగి పొందడానికి సంవత్సరాలు పడుతుంది.
నావికాదళంపై ప్రభావం
భారత నావికాదళం ఇటీవల 220 బ్రహ్మోస్-ER (Extended Range) క్షిపణుల కోసం ₹23,000 కోట్లతో భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది. ఉత్పత్తి 50% తగ్గడం వల్ల యుద్ధనౌకలకు కావాల్సిన క్షిపణుల సరఫరాలో బహుళ-సంవత్సరాల ఆలస్యం జరిగే ప్రమాదం ఉంది. విశాఖపట్నం, కోల్‌కతా క్లాస్ విధ్వంసక నౌకలు బ్రహ్మోస్ లేనిదే పూర్తిస్థాయి పోరాట సామర్థ్యాన్ని ప్రదర్శించలేవు. సముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న వేళ, మన నిరోధక శక్తి తగ్గడం ఆందోళనకరం.
ఎగుమతి విశ్వసనీయతకు గండి?
ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాలు బ్రహ్మోస్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. కానీ స్వదేశీ అవసరాలకే డెలివరీ ఇవ్వలేని స్థితిలో ఉన్నామని తెలిస్తే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన 'డిఫెన్స్ ఎగుమతిదారు' ఇమేజ్ దెబ్బతింటుంది. ఎగుమతి ఆర్డర్లను అందుకునేందుకు లక్నోలో కొత్త ప్లాంట్ నిర్మించినా, అక్కడ పనిచేయడానికి అవసరమైన శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడం లోటనే చెప్పాలి.
బ్రహ్మోస్-NG (Next Generation) వంటి భవిష్యత్ ప్రాజెక్టులు ఇంకా ఆమోదం కోసం వేచి చూస్తుండగా.., ఉన్న ఉత్పత్తి వ్యవస్థను గందరగోళంలోకి నెట్టడం సరికాదు. పారిశ్రామిక విస్తరణ అనేది నిపుణుల పరివర్తన ప్రణాళికతో జరగాలి తప్ప, బలవంతపు బదిలీలతో కాదు.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బ్రహ్మోస్ ఏరోస్పేస్‌లోని అంతర్గత సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే మన క్షిపణులు మళ్లీ వేగంగా ఉత్పత్తి శ్రేణిని దాటి దేశ సరిహద్దులను రక్షించగలవు. క్షిపణి వేగం కంటే, తయారు చేసే వ్యవస్థ స్థిరత్వం ఇప్పుడు అత్యంత ముఖ్యం.