బానిసలా చూశాడు.. పాతమిత్రుడిపై ఫైర్.. సీఎం పదవిని పంచుకోం

Update: 2021-06-14 10:30 GMT
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా.. మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేసే నేతల్లో ఒకరిగా శివసేన ఎంపీ సంజయ్ రావుత్ ను చెబుతారు. బీజేపీ అంటేనే మండిపడే ఆయన.. ఆ పార్టీపైనా మరి ముఖ్యంగా మోడీషాల మీదా.. వారి టీం మీదా ఫైర్ అయ్యే ఛాన్సుల్ని అస్సలు వదులుకోరు. ఇటీవల తమ పార్టీ అధినేత.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే  ప్రధాని మోడీతో భేటీ అయిన నేపథ్యంలో.. ఆ పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా భేటీ తర్వాత తమ పార్టీకి బీజేపీకి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అనే వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

తమ విషయంలో బీజేపీ చేసిన గాయాల్ని తామింకా మర్చిపోలేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. 2014 - 2019 వరకు మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అదంతా శివసేన చలువేనని చెప్పిన రావత్.. ఆ కాలంలో పార్టీని అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయన్నారు. బీజేపీ ప్రభుత్వంలో శివసేనకు ద్వితీయ హోదా ఉండేదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ పార్టీని ముగించే ప్రయత్నాలు కూడా జరిగినట్లు ఆరోపించారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని.. ముఖ్యమంత్రి పీఠం శివసేన దగ్గరే ఉంటుందన్నారు. ఐదేళ్లు సీఎం పదవి సేనదేనని.. ఎవరితోనూఆ పదవిని పంచుకోమని స్పష్టం చేశారు. మిత్రపక్షాలు సీఎం పదవిని ఆశించటాన్ని తప్పు పట్టలేమన్న ఆయన.. సైద్ధాంతికంగా మూడు వేర్వేరు పార్టీలమైనప్పటికీ ప్రభుత్వాన్ని నడపటానికి కలిసి వచ్చామన్నారు. ఇప్పుడు రాజకీయంగా ఒక్కటయ్యామని చెప్పారు. 2024లో మోడీపై పోరాటం చేయటానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తే.. అందులో తప్పు లేదన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించిన ప్రధానిగా మోడీనే పదవిని చేపడతారని దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అలా జరగదని తాము ఎప్పుడూ చెప్పలేదన్న ఆయన.. ఫడ్నవీస్ తమ పార్టీ వైఖరిని చెబుతున్నారన్నారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్న ఆయన.. బెంగాల్ లో బీజేపీ ఓటమిపాలు కాలేదని.. మోడీషాలే ఓడిపోయారని వ్యాఖ్యానించటం గమనార్హం. చూస్తుంటే.. బీజేపీతో కాదు మా లొల్లి మొత్తం మోడీషాలతోనే అన్నట్లుగా రావత్ మాటలు ఉన్నాయి కదూ?
Tags:    

Similar News