ఐక్యత బిల్డప్ తో అబద్ధాలెందుకు సార్!

Update: 2017-08-15 13:46 GMT
రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పినంత మాత్రాన జనం ఎన్నడూ సీరియస్ గా పట్టించుకోవడం ఉండదు. ఎందుకంటే.. రాజకీయం అంటేనే అబద్ధం అనే అభిప్రాయం అందరిలోనూ సమానంగా ఉంటుంది. కానీ అదే రాజకీయాల్లో కొందరు నాయకులు చెప్పే మాటలకు మాత్రం విలువ ఉంటుంది. అలాంటి వారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఒకరు. తన పరిపాలనలో నిజాయితీ ద్వారా, వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి మరక లేకపోవడం ద్వారా ఆయన ప్రజల్లో సంపాదించుకున్న క్రెడిబిలిటీ అది. అయితే ఆయన కూడా ‘అశ్వత్థామ హత: కుంజర:’ అంటి అర్థసత్యాల అబద్ధాలు చెబుతుండే సరికి.. పలువురికి ఆశ్చర్యం కలుగుతోంది. రాత్రికి రాత్రే మహాకూటమి సర్కారును కూలదోసి భాజపాతో కలిసిగద్దె ఎక్కినా.. ఆయన మీద ఎవరూ పెద్దగా నిందలు వేయలేదు.

ప్రజాభిప్రాయం నితీశ్ కు మద్దతుగానే ఉన్నప్పటికీ.. పార్టీలో మాత్రం చీలిక తప్పకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు. ఎందుకంటే.. భాజపాతో మైత్రి ఇష్టంలేని ఓ వర్గం పార్టీలో ఉంది. దానికి శరద్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు కూడా.. అయితే ఇమేజి కోసం నితీశ్ తాజాగా చెబుతున్న అబద్ధం ఏంటంటే.. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని.. అంతా ఐక్యంగానే ఉన్నాం అని అంటున్నారు. జేడీయూ శ్రేణులు సమస్తం నితీశ్ వెంటే ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
Read more!

కానీ వాస్తవం ఆయన మాటలకంటె భిన్నంగా ఉంది. ప్రధానంగా ఈ నిర్ణయంతో విభేదిస్తున్న పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ స్వచ్ఛందంగా పార్టీనుంచి వెళ్లిపోయినట్లుగా.. నితీశ్ బృందం ఓ అధికారిక ప్రకటన చేసింది. అలాగే శరద్ యాదవ్ కు అనుకూలురనే ముద్ర ఉన్న బీహార్లోని 21 మంది సీనియర్ నాయకుల్ని పార్టీనుంచి సస్పెండ్ చేసేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా వీరి మీద ఆరోపణ చేశారు.

అయితే ఒకవైపు పార్టీ అధ్యక్షుడు స్వచ్ఛందంగా వెళ్లిపోయాడంటున్నా, 21 మందిని వీరే మెడపట్టుకు బయటకు గెంటేసినా.. వారందరూ కలిసి  రేపు కొత్త పార్టీ పెట్టుకుంటే.. అది జేడీయూ చీలిక వర్గం కిందికే వస్తుంది కదా? కానీ.. ‘అబ్బెబ్బే.. జేడీయూ లో ఎలాంటి చీలికకు అవకాశం లేదు’ అంటూ నితీశ్ వర్గం బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం.
Tags:    

Similar News