పద్మ పురస్కారాల్ని విసిరికొట్టాలన్నాడు

Update: 2015-04-12 05:43 GMT
హద్దులు దాటే అసహనం లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తుందన్న విషయాన్ని జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. పార్టీ అధినేతగా సంయమనంతో వ్యవహరించాల్సిన ఆయన మొండిగా.. మూర్ఖంగా మాట్లాడే ధోరణి ఈ మధ్య పెరిగింది.

ఇటీవల దక్షిణాది మహిళల ఒంటి ఛాయ గురించి మాట్లాడటం.. అది కాస్తా వివాదాస్పదం కావటమే కాదు.. పార్లమెంటులో పెద్ద చర్చ జరగటం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా.. తనను తాను సమర్థించుకున్న ఆయన వైఖరిని చూసి విస్తుపోయిన వారున్నారు. శరద్‌యాదవ్‌ లాంటి సీనియర్‌ నేతకు సైతం ఏమైందని మదనపడిన వారూ ఉన్నారు.  

తన వ్యాఖ్యల తీరుపై వెల్లువెత్తిన విమర్శలతో చివరకు ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలాంటి శరద్‌యాదవ్‌ తాజాగా పద్మ పురస్కారాలపై వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. నిజాయితీ లేని వారికి.. అధికారుల అండదండలు ఉన్న వారికి మాత్రమే పద్మ పురస్కారాలు అందుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. అలా అని అదంతా మోడీ సర్కారు తప్పు అన్న వ్యాఖ్య చేయకుండా.. ఇలాంటి ధోరణి గత 68 ఏళ్లుగా సాగుతోందని వ్యాఖ్యానించారు.

పద్మ అవార్డుల జారీ విషయలో సాగుతున్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆ పురస్కారాల్ని విసిరికొట్టాలంటూ పిలుపునిచ్చారు. పద్మ పురస్కారాల్ని చూస్తే.. అందులో రైతులు.. ఆదివాసీలు.. దళితులు మచ్చుకైనా కనిపించరని ఆయన వాదించారు. అర్హులకు పద్మ పురస్కారాలు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 68 ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు గురించి ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటపెట్టాల్సి వచ్చింది? మరి ఇంతకాలం ఎందుకు పెదవి విప్పనట్లు..?

Tags:    

Similar News