బీజేపీ ఏపీ ఆశలపై నీళ్లు చల్లిన సెటిలర్లు!

Update: 2020-12-05 04:23 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటానికి బీజేపీ కొంత కాలంగా చేయని ప్రయత్నం లేదు. సొంతంగా ఎదిగేందుకు ఆ పార్టీ భారీ ఎత్తున వ్యూహాల్ని సిద్ధం చేసింది. అయితే.. ఉత్తరాది మాదిరి దక్షిణాదిన రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయటం అంత తేలికైన విషయం కాదన్నది వారికి అర్థమైంది. అందుకే.. రెండు తెలుగు రాష్ట్రాల మీద ఒకేసారి ఫోకస్ పెట్టకుండా.. ఒక రాష్ట్రం తర్వాత మరొకటి అన్నట్లుగావ్యవహరిస్తోంది. దీనికి తోడు ఏపీ అధికారపక్షం ఇప్పుడు బలంగా ఉండటం.. ప్రజలంతా అధికారపక్షం వైపు ఉన్న వేళ.. తమకున్న అవకాశాలు స్వల్పమేనన్న విషయాన్ని గుర్తించాయి.

అందుకే.. తొలుత తెలంగాణను క్రాక్ చేయాలని కమలనాథులు భావించారు. దీనికి తగ్గట్లే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వారికి కలిసి వచ్చేలా చేశాయి. తెలంగాణలో తమకు తిరుగులేదని..తాము చెప్పే మాటలకు తెలంగాణ ప్రజలు నమ్ముతారని.. తాను చెప్పినట్లే చేస్తారన్న విశ్వాసం కేసీఆర్ లో అంతకంతకూ ఎక్కువ కావటం.. అందుకు తగ్గట్లే ఆయన వ్యవహారశైలి ఉండటం తెలిసిందే. దీంతో చిరాకు పడుతున్న తెలంగాణ ప్రజలు తమదైన సమయం కోసం ఎదురు చూశారు. ఇంతకాలం టీఆర్ఎస్ కు రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవటంతో ఓటరు సైతం తన మనసులోని మాటను బయటపెట్టలేదు.

తాజాగా జరిగిన గ్రేటర్ లో.. బీజేపీ రూపంలో బలమైన పార్టీ ఒకటి బరిలోకి దిగటం.. కేంద్రం ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో ఓటరు సైతం తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పేశారు. దీంతో.. ఊహించని రీతిలో గ్రేటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలంగాణవాదులకు అడ్డాఅయిన టీఆర్ఎస్ పార్టీ పరువును.. ప్రతిష్ఠను గ్రేటర్ ఎన్నికల్లో ఎవరైనా నిలిపారంటే అది ఏపీ సెటిలర్లు మాత్రమే.

ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉంటే శేరిలింగంపల్లి.. కుకట్ పల్లి.. కుత్భుల్లాపూర్ నియోజకవర్గాల్లోని డివిజన్లలో కేవలం మూడింటిలో తప్పించి.. మిగిలిన అన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. అదే లేనిపక్షంలో దారుణమైన పరాజయం టీఆర్ఎస్ కు దక్కేది. ఈ ఫలితం చూసినప్పుడు ఆంధ్రా సెటిలర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టం కాక మానదు. ఈ తీర్పు.. ఏపీలో బీజేపీకి.. దానితో పొత్తు పెట్టుకున్న జనసేనకు లేదన్న విషయాన్ని తాజాగా తమ ఓటుతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News