గేట్స్ అలాంటోడా? వరుస పెట్టి ఆరోపణల మరకలు

Update: 2021-07-01 16:30 GMT
నిన్నమొన్నటి వరకు అపర కర్ణుడు.. పోతపోసిన మంచితనానికి నిలువెత్తు రూపంగా చెప్పే బిల్ గేట్స్ మీద ఇటీవల కాలంలో వస్తున్న ఆరోపణల పర్వం అంతా ఇంతా కాదు. మొన్నటివరకు మంచివాడు.. శ్రీరామచంద్రుడు కాస్తా ఇప్పుడు అందుకు భిన్నమైన ఇమేజ్ ను ఆయన చుట్టూ అల్లేస్తున్నారు. మిలిందాతో ఎప్పుడైతే కటీఫ్ చెప్పేసి.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారో అప్పటి నుంచి ఆయనపై అదే పనిగా ఆరోపణలు.. ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే ఉదంతాలు ఆయన్ను వెంటాడుతున్నాయి.

ఇప్పటివరకు ఉన్నవి చాలదన్నట్లుగా తాజాగా ఆయన వ్యక్తిత్వాన్ని 360 డిగ్రీస్ లో డ్యామేజ్ చేసేలా వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన మీద రెండు బయోగ్రఫీలు రాసిన జేమ్స్ వాల్లేస్ తాజాగా గేట్స్ మీద విపత వ్యాఖ్యలు చేశారు. ఎనభై.. తొంభైల తొలినాళ్లలో గేట్స్ విపరీతమైన పార్టీలు నిర్వహించేవారని.. ఆ టైంలో తన పనిని పక్కన పెట్టేసే వారని పేర్కొన్నారు.

అంతేనా.. రాత్రిళ్లు పార్టీ సమయానికి లోకల్ నైట్ క్లబ్ ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడని.. వాళ్లతో కలిసి నగ్నంగా స్విమ్ చేసేవాడని.. వాళ్ల చుట్టూ తిరిగేవాడని పేర్కొన్నారు. తప్ప తాగి.. జల్సాలు చేసేవాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గేట్స్ బయోగ్రఫీ రాసిన పెద్ద మనిషి మాత్రమే ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటే.. ఏమోనని సర్ది చెప్పుకోవచ్చు. ఆయనకు తోడుగా రాబర్ట్ క్రింగ్లే అనే బ్లాగర్ సైతం గేట్స్ తీరును తీవ్రంగా తప్పు పట్టటం గమనార్హం.
Read more!

ఈ రచ్చ ఇలా సాగుతుంటే.. మరోవైపు ఆయన సంస్థలో పని చేసిన ఉన్నత ఉద్యోగి సైతం ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1988లో తాను ఒక రోజు గేట్స్ ను చూసే సమయానికి ఒకమహిళపై వాలిపోయి కనిపించాడని.. అదే సమయంలో మరోవైపు మిలిందాతో రిలేషన్ షిప్ ఉండేదని సదురు ఉద్యోగి వెల్లడించారు. అంతేకాదు.. గేట్స్ కు తనకు నచ్చని వారి విషయంలో వారిని గట్టిగా అరిచేవాడని పేర్కొన్నారు. మిలిందాతో ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ఆయనపైనా.. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా కథనాలు పెద్ద ఎత్తున ప్రచారం కావటం గమనార్హం.
Tags:    

Similar News