కడప ఖిల్లాలో సీనియర్ కలకలం ?

Update: 2021-11-30 02:30 GMT
కడప అంటే జగన్ సొంత జిల్లా. వైఎస్సార్ ఫ్యామిలీకి విజయాల ఖిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఏపీలో కానీ కడపలో మెజారిటీ సీట్లు అపుడు కాంగ్రెస్ వి అయితే ఇపుడు వైసీపీవి.  ఇక 2019 ఎన్నికల్లో అయితే ఏకంగా మొత్తానికి మొత్తం పది సీట్లను వైసీపీ కైవశం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు, ఎంపీ సీట్లతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో రీసెంట్ గా బద్వేల్ ఉప ఎన్నికల్లో సైతం ఫ్యాన్ జోరుని కొనసాగించింది. ఇక జగన్ కి వైసీపీకి కడప జిల్లా అంటే గట్టి ధీమా ఉంది.

అలాంటి కడప ఇలాకాలో కలక‌లం సృష్టించేందుకు ఒక సీనియర్ మోస్ట్ లీడర్ రెడీ అవుతున్నాడు. ఆయన ఎవరో కాదు వైఎస్సార్ కి ఒకనాటి సహచరుడు, జగన్ ని 2011 కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఢీ కొట్టిన నాయకుడు. ఆయన వైఎస్సార్ ఫ్యామిలీకి పొలిటికల్ గా ప్రత్య‌ర్ధి. అయితే రాజకీయాల్లో ఎపుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చి జగన్ వైపు వచ్చేశారు. ఆయన తనకు తోచిన విధంగా సాయం చేశాడు. వైసీపీ కడపలో రికార్డ్ బ్రేక్ విక్టరీ సాధించడానికి ఆయన వాటా ఉందని భావిస్తారు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చింది. రెండున్నరేళ్లు సాగిపోయాయి. అయితే ఆయనకు అనుకున్న పదవి అయితే దక్కడంలేదు. ఆయన మనసులో కోరిక ఏంటి అంటే ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేయాలని, మరి జగన్ ఆ ముచ్చట తీరుస్తాడు అనుకుంటే అసలు జరగడంలేదు. పైగా కడపకు చెందిన మరో మాజీ మంత్రి సి రామచంద్రయ్యను ఎమ్మెల్సీని చేశారు. దాంతో పాటు రీసెంట్ గా గోవిందరెడ్డికి మరో చాన్స్ ఇచ్చేశారు. ఈ పరిణామాలతో ఇక తనకు పదవి ఏదీ దక్కదు అని నిర్ధారణకు వచ్చిన మీదటనే డీఎల్ బాణాలు వేయడం మొదలెట్టారని టాక్.

జగన్ సర్కార్ ని ఆయన తూర్పారా పడుతూ ఈ మధ్యనే మీడియాకు ఎక్కారు అది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నారు. రానున్న రోజుల్లో ఆయన కడప జిల్లాలో గడప గడపకు వెళ్ళి మరీ వైసీపీ సర్కార్ ని ఎండగడతారు అంటున్నారు. అంతే కాదు, సాధ్యమైనంత ఎక్కువ మంది బడా వైసీపీ  నేతలను వెంటబెట్టుకుని మరీ టీడీపీలో చేరుతారు, ఆ విధంగా వైసీపీకి గట్టి స్ట్రోక్ ఇస్తారని టాక్ అయితే నడుస్తోంది. ఆయనతో పాటు ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పే వారిలో జమ్మలమడుగు సీనియర్ నేత రామసుబ్బారెడ్డితో ఇతర నాయకులు కూడా ఉన్నారుట. మొత్తానికి జగన్ని ఈసారి కడప జిల్లాలో ఓడిస్తామని ఈ సీనియర్ అనుచరులు చెబుతున్నారు. డీఎల్ రాజకీయం ఆయన వ్యూహాలు పదునుగా ఉన్నాయి. మరి దీన్ని జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి.
Tags:    

Similar News