పెళ్లి పేరుతో మస్కా.. రూ.5 లక్షలు దోచేసింది..

Update: 2020-12-08 06:27 GMT
పెళ్లి సంబంధాల వ్యవహారం పేరయ్యలను దాటి ఇంటర్నెట్‌ లోకి ప్రవేశించాక మోసాలు ఎక్కువగా  అయ్యాయి. పెద్ద చదువులు, ఉన్నత కుటుంబం, మంచి ఉద్యోగం, విదేశాల్లో జీవితం అని మాయమాటలతో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. వారి మాటలను నమ్మి డబ్బు, బంగారం ఇస్తున్నారు.

 ఇటీవల బర్కత్‌పురా ప్రాంతానికి ఓ వ్యక్తి ఉన్నత విద్యనభ్యసించారు. వివాహం చేసుకోవాలనే ఉద్దేశం తో ఆయన కొన్నాళ్ల క్రితం సంగం.కామ్‌ అనే మాట్రిమోనియల్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈయన కు ఇటీవల రీటాగా చెప్పుకున్న, ఆ పేరుతో రిజిస్టర్‌ చేసుకున్న యువతితో ఈ సైట్‌ ద్వారా పరిచయమైంది.  

 రీటా అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నానంటూ చాటింగ్‌లో చెప్పింది. ఇలా వీరి పరిచయం పెరిగింది. ఆ తర్వాత రీటా.. నగర వాసి దగ్గర పెళ్లి ప్రస్తావన  తెచ్చింది. హఠాత్తుగా ఓ రోజు మన పరిచయానికి గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు పంపిస్తున్నానంటూ సందేశం పంపింది. ఆపై రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులుగా చెప్పుకుంటూ కొందరు నగర వాసికి కాల్‌ చేశారు.  

అమెరికా నుంచి మీ పేరుతో ఓ పార్శిల్‌ వచ్చిందని చెప్పారు. అందులో ఖరీదైన గిఫ్ట్‌లతో పాటు కొన్ని డాలర్లు సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని హైదరాబాద్‌కు పంపాలంటే కస్టమ్స్‌ క్లియరెన్స్‌ తప్పనిసరని చెప్పారు. దానికోసం కొన్ని ట్యాక్సులు కట్టాల్సి ఉంటుందంటూ దఫదఫాలుగా బాధితుడి వద్ద నుంచి రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించారు.   ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులు లబోదిబోమన్నాడు.

తాను మోసపోయాననే విషయం గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణా లో ఫిర్యాదు చేయడం తో కేసు నమోదైంది. రీటాగా చెప్పుకున్న మహిళ +11తో మొదలయ్యే నంబర్‌ తో వాట్సాప్‌ చాటింగ్‌ చేసింది. బాధితుడు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలన్నీ ఢిల్లీలో, సోనియా శర్మ పేరుతో ఉన్నాయి. వీటి ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 పేరుపొందిన కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరి చేతినిండా డబ్బు సంపాదించి యువకులు వైవాహిక జీవితంపై చాలా ఆశలు, కలల్లో ఉంటారు. కుటుంబ సభ్యులు, బందువుల మాటలను లెక్కచేయకుండా వెబ్‌సైట్లలో సంబంధాలను గాలిస్తూ వంచకుల చేతుల్లో మోసపోతున్నారు.  అమాయక యువకులకు అర్ద నగ్న ఫోటోలు సేకరించి, వాటిని ఇంటర్నెట్‌ లో పెడతామని బెదిరించడం, సాధ్యమైనంత దండుకోవడం వంటి కేసులు ఇటీవల తరుచూ పెరిగిపోతున్నాయి.
Tags:    

Similar News