బాల‌య్య‌కు షాకిస్తూ..మోడీకి సాయికుమార్ క్ష‌మాప‌ణ‌లు

Update: 2018-04-24 10:24 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. ఇప్ప‌టికే ఏపీలోని ఆ పార్టీకి చెందిన‌ నేత‌లు ఈ ఎపిసోడ్‌పై స్పందించి బాల‌య్య‌ను తీవ్రంగా దుయ్య‌బ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేష‌న్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీనికి స్పంద‌న‌గా తానేమీ త‌ప్పుమాట్లాడ‌లేద‌ని బాల‌య్య వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ సినీ న‌టుడు,  ‘డైలాగ్‌ కింగ్‌’ సాయికుమార్ బాల‌య్య కామెంట్లపై స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కర్నాటకలోని బాగేపల్లిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే సందర్భంగా ఖాదీ లక్ష్మినారసింహుని ఆశీస్సుల కోసం తనయుడు ఆదితో క‌లిసి సినీ నటుడు సాయికుమార్ దేవాల‌యానికి వ‌చ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోడీపై బాలకృష్ణ చేసినవి అనుచిత వ్యాఖ్యలని ఆయన అన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ పై బాలయ్య బాబు వ్యాఖ్యలకు  సాటి నటుడిగా నేను క్షమాపణలు కోరుతున్నానని అన్నాడు. బాలయ్య బాబు ఆవేశపరుడని - మోడీ గారిని అలా మాట్లాడకూడదని… అతని తరపున తాను క్షమాపణ కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం మోడీ కాళ్లు అయినా పట్టుకుంటానని ప్ర‌క‌టించారు. త‌న మాతృభాష తెలుగు హృదయ భాష కన్నడ అని సాయికుమార్ అన్నారు. బాగేపల్లి అభివృద్ధి కి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయిన సాయికుమార్‌ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.
Tags:    

Similar News