'రైతుబంధు-బతుకమ్మ చీరల' రాజకీయం..

Update: 2018-09-22 07:02 GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెరతీసిన వేళ అందరిలోనూ ఎన్నికల ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ అప్పుడే 105మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో  టీఆర్ ఎస్ శ్రేణులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నాయి కాంగ్రెస్ మహాకూటమి పెట్టి ఇప్పుడే కార్యక్షేత్రంలోకి దుంకేందుకు రెడీ అవుతోంది.

సీఎం కేసీఆర్ కు కొండంత బలం... ఆయన ప్రవేశపెట్టిన పథకాలే. అందుకే అభ్యర్థులపై ఎంత వ్యతిరేకత ఉన్నా తన పథకాలే తనను గెలిపిస్తాయని.. తన ముఖం చూసే జనాలు ఓటేస్తారని కేసీఆర్ నమ్మకంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మిషన్ కాకతీయ, భగీరథ సహా తాజాగా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ - రైతుబీమా - బతుకమ్మ చీరల పథకాలు అందరికీ లబ్ధి చేకూర్చేవి. ఇప్పుడు వాటి సమయం వచ్చేసింది. ఖరీఫ్ పూర్తై రబీ మొదలు కాబోతోంది. ప్రభుత్వం రైతులకు రైతుబందు పేరిట ఎకరానికి రూ.4వేలు ఇవ్వాలి . కానీ కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పుడాయనకు ఇచ్చే అధికారం లేదు. కానీ బడ్జెట్ ఎప్పుడో కేటాయించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు చెక్కులు సహా ఇప్పటికే సిరిసిల్లలో పూర్తయిన బతుకమ్మ చీరలను దసరా కానుకగా గవర్నర్ పంపిణీ చేస్తారా.? లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే ఎన్నికల కోడ్ వస్తే ఏ పథకాలు అమలు చేయడానికి లేదు.  టీఆర్ ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తే ఆ పార్టీకి గొప్ప ప్లస్ గా మారి ఓట్ల వాన కురుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక కోడ్ ఉందని పంపిణీ చేయవద్దని అడ్డుకుంటే ప్రజల్లో విలన్ అయ్యే అవకాశం ఉంది. టీఆర్ ఎస్ దీన్నే అస్త్రంగా చేసుకొని పేదలు - రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలను కాంగ్రెస్ అడ్డుకుందని ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసిందట.. ఇలా టీఆర్ఎస్ పథకాలు అమలు చేయించినా నష్టమే.. అడ్డుకున్నా పెద్ద నష్టమే రీతిలో కాంగ్రెస్ కు సంకట స్థితి ఏర్పడిందట.. ఇదే సమయంలో టీఆర్ ఎస్ కు పథకాలే కొండంత బలమవుతున్నాయి. మరి గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు.? కాంగ్రెస్ నేతలు తెలిసి అడ్డుకొని మరీ వారి గొయ్యి తవ్వుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News