రూ.166.93 కోట్ల మోసం..సి.ఐ.టి.ఎల్ పై సిబిఐ కేసు నమోదు!

Update: 2020-10-01 07:00 GMT
బ్యాంకుఇచ్చిన క్రెడిట్‌ లిమిట్‌ను దుర్వినియోగం చేసి రూ.166.93 కోట్లు దారి మళ్లించిన ఘటనలో హైదరాబాద్‌ కు చెందిన చదలవాడ ఇన్ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ (సి.ఐ.టి.ఎల్‌.) సంస్థతో పాటు దాని సంచాలకులపైనా హైదరాబాద్‌ సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి 13న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దేబాశిష్‌  భట్టాఛార్జి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు నిర్వహించిన సీబీఐ అధికారులు తాజాగా కేసు ఫైల్ చేశారు. సి.ఐ.టి.ఎల్‌. మేనేజింగ్‌ డైరెక్టర్‌ చదలవాడ రవీంద్రబాబు, సహ వ్యవస్థాపకుడు చదలవాడ వెంకట సుబ్బారావులు నాచారం పారిశ్రామికవాడలోని ఎస్బీఐలో రూ.281.23 కోట్లకు క్రెడిట్‌ లిమిట్‌ పొందారు.  

పలు రాష్ట్రాల్లో విద్యుదీకరణ పనులతో పాటుగా ఏవేవో పనుల పేరుతో బ్యాంకు నుంచి లోన్ సదుపాయం పొందారు. ఈ సంస్థ ఖాతాలను ఎస్బీఐ 2012 సెప్టెంబరు 22న నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చింది. అయినప్పటికీ ఈ సంస్థ 2014 ఏప్రిల్‌ 17న ఒకసారి, 2015  డిసెంబరు 11న మరోసారి అంతకు ముందే ఇచ్చిన క్రెడిట్‌ సదుపాయం ద్వారానే చెల్లింపుల కోసం అనుమతి కోరి, బ్యాంకు నుంచి ఆమోదం పొందింది. తద్వారా  నిధులు మళ్లింపునకు పాల్పడింది. సంస్థ కార్యకలాపాలపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు సి.ఐ.టి.ఎల్‌.కు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ గా వ్యవహరించిన రాజు, ప్రసాద్‌ ల సంస్థలపై దాడులు నిర్వహించి, స్వాధీనం చేసుకున్న దస్త్రాలకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించింది. సి.ఐ.టి.ఎల్‌. తరఫున అందులోని సంచాలకులు, వాటాదారులు, ఉద్యోగులు, సబ్ ‌కాంట్రాక్టర్లు, సోదర సంస్థలకు పెద్దఎత్తున చెల్లింపులు జరిగినట్లు తేలింది.
Tags:    

Similar News