ఓడి పైచేయి అనటం మీకే చెల్లింది కేటీఆర్
మున్సిపాలిటీలతో పోలిస్తే నగర కార్పొరేషన్లలో దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న దుస్థితి. మొత్తం 7 నగర కార్పొరేషన్లలో రెండు కార్పొరేషన్ల మినహా మిగిలిన ఐదు చోట్ల సింగిల్ డిజిట్ దాటని పరిస్థితి.;
విడి రోజుల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున పార్టీ కీలక నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఫలితాలపై నిజాయితీగా స్పందించాల్సి ఉంటుంది. అనవసరమైన బిల్డప్ లు.. అవసరానికి మించిన అతిశయాలు మాట్లాడితే మొదటికే మోసం రావొచ్చు. బ్యాక్ ఫైర్ కావొచ్చు. ఓటమి తర్వాత కూడా ఈ కవరింగ్ ఏమిటి సామీ అని జనాలు నవ్వుకోవచ్చు. బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు ఇంచుమించు ఇలానే ఉంది. తాజాగా వెలువడుతున్న మున్సిపాలిటీల ఫలితాలు.. కార్పొరేషన్ ఫలితాలు నిరాశను కలిగించేలా ఉన్నాయి.
అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీగా బీఆర్ఎస్ నిలిచినా.. పలు జిల్లాల్లో తాను కోల్పోయిన ఆదరణ ఎంతన్నది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళలో.. హుందాగా ఓటమిని ఒప్పుకొని.. రానున్న రోజుల్లో తమ సత్తా చాటుతామని కానీ ఇంకేదైనా కానీ చెబితే సరిపోతుంది. అందుకు భిన్నంగా అవసరానికి మించిన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మాట్లాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తున్నాయన్న కేటీఆర్.. తాము పెద్ద ఎత్తున స్థానాల్ని గెలుచుకోనున్నట్లుగా పేర్కొన్నారు. కానీ.. వాస్తవానికి వచ్చింది మాత్రం తక్కువ. మొత్తం 2582 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం 717 వార్డుల్లోనే విజయం సాధించారు. అంటే.. 30 శాతం కంటే తక్కువ చోట్లనే బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
మున్సిపాలిటీలతో పోలిస్తే నగర కార్పొరేషన్లలో దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న దుస్థితి. మొత్తం 7 నగర కార్పొరేషన్లలో రెండు కార్పొరేషన్ల మినహా మిగిలిన ఐదు చోట్ల సింగిల్ డిజిట్ దాటని పరిస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్ లో అయితే.. కేవలం ఒక్క వార్డులో మాత్రమే విజయంసాధించిన పరిస్థితి. ఈ కార్పొరేషన్ లో మొత్తం 60 వార్డులు ఉండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఎన్నికల ఫలితాల్లో తాము మంచి ఫలితాల్ని నమోదు చేసినట్లుగా వ్యాఖ్యలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న.
కళ్ల ముందు ఫలితాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ.. అంకెలు ప్రశ్నిస్తున్న వేళలో.. మాటలతో వాస్తవాల్ని దాచేయాలన్నట్లుగా వ్యవహరించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న చిన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు విస్మరిస్తున్నట్లు? అన్నది ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని.. మున్సిపల్ ఎన్నికల పలితాలతో ఆ పార్టీ నేతలు నోళ్లు మూతపడ్డాయన్న కేటీఆర్ మాటలకు నవ్వాలో? ఏడవాలో అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టిందన్న ఆయన వ్యాఖ్యల్ని తీసుకుంటే.. మరి.. బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారీ అదే పని చేసిందా? అన్న ప్రాధమిక ప్రశ్నను ఓటర్లు సంధించరా? అన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు గుర్తించరు?
కాంగ్రెస్, బీజేపీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని.. లౌకిక పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందన్న కేటీఆర్.. గతాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. లౌకిక పార్టీలను చులకనగా చూడటమేకాదు.. ఆ పార్టీ ప్రతినిధులు అప్పటి సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వస్తే.. గంటల సేపు వెయిట్ చేయించి.. కలవకుండానే వెనక్కి పంపేసిన ఘన చరిత్ర గులాబీ పార్టీది. అలాంటి పార్టీ ఈ రోజున లౌకిక పార్టీలంటూ చిన్న పార్టీలను పేర్కొంటూ.. వారితో తాము కలుస్తామని పేర్కొనటం చూస్తే.. గతాన్ని కేటీఆర్ కన్వీనీయింట్ గా మర్చిపోయారా? అనుకోకుండా ఉండలేం. తాజాగా ఫలితాలు వెల్లడవుతున్న మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో ఫలితాలు ఏ మాత్రం బాగోలేని వేళ.. అందుకు భిన్నంగా మాట్లాడిన కేటీఆర్ ను చూస్తే.. బిల్డప్ భరించలేకున్నాం బాబోయ్ అన్న మాట మనసులోకి రావటం ఖాయం.