రూ.వెయ్యి కేసు.. రూ.10తో క్లోజ్.. తెలంగాణలో ఈ నెల 8తో ఆఖరు

Update: 2022-05-03 05:48 GMT
ప్రపంచాన్ని వణికించిన కరోనా టైంలో.. ప్రజల్లో వీధుల్లోకి రాకుండా ఉండేందుకు వీలుగా లాక్ డౌన్ విధించటం తెలిసిందే. ప్రభుత్వం పేర్కొన్న సమయంలో కాకుండా విడి వేళల్లో బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసిన వైనం తెలిసిందే. అప్పట్లో లాక్ డౌన్ వేళలో బయటకు వస్తే.. వారికి వెయ్యి రూపాయిల చొప్పున జరిమానా విధించే కేసుల్ని నమోదు చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బోలెడన్ని కేసులు నమోదయ్యాయి.

తాజాగా అలాంటి కేసుల లెక్క తేల్చేసేందుకు వీలుగా బంఫర్ ఆఫర్ ను ప్రకటించారు. లాక్ డౌన్ వేళలో బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వారిపై నమోదు చేసిన కేసులకు సంబంధించి.. వాటిని సులువుగా పరిష్కరించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. న్యాయస్థానాలు ఒక చక్కటి అవకాశాన్ని కల్పించాయి.

రెండు లాక్ డౌన్ లో నిబంధనల్ని అతిక్రమించి బయటకు తిరిగి.. కేసుల్లో బుక్ అయిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేవలం రూ.10 చెల్లించటం ద్వారా కేసును క్లోజ్ చేసుకునే సదవకాశాన్ని కల్పించారు.

ఎవరైనా సరే.. తమపై ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా కేసు నమోదు అయ్యిందో.. సదరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆధార్ కార్డును సమర్పించి వెయ్యి రూపాయిల ఫైన్ కు బదులుగా రూ.10 చెల్లిస్తే సరిపోతుంది.

అలా రూ.10 కట్టేసిన వారిపై ఉన్న కేసును క్లోజ్ చేస్తారు. ఈ తరహా కేసుల్లో కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. స్థానిక పోలీస్ స్టేషన్ లోనే కేసును క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లుగా పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

లాక్ డౌన్ వేళలో కుప్పలు.. కుప్పలుగా నమోదైన ఈ తరహా కేసుల్ని ఈ రీతిలో క్లోజ్ చేయటం సరైన నిర్ణయంగా చెప్పక తప్పదు. ఈ ఆఫర్ ఈ నెల 8 వరకు మాత్రమే ఉండటంతో.. కేసులు నమోదైన వారు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News