కేటీఆర్ కు ఇబ్బందిగా మారిన ఫైర్ బ్రాండ్ పిటిషన్

Update: 2020-06-05 12:30 GMT
కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. ఆయన కుమారుడు కేటీఆర్ తీరుపై తరచూ ఘాటు విమర్శలతో పాటు.. భారీ ఆరోపణలు చేస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆ మధ్యన మంత్రి కేటీఆర్ కు చెందిన ఫాంహౌజ్ అంటూ హడావుడి చేసిన రేవంత్.. దాని నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లుగా ఆరోపించారు.

ఈ ఎపిసోడ్ లోనే ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది కూడా. ఆయన చేసిన ఆందోళనలు.. నిబంధనల్ని ఉల్లంఘించిన వైనంపై ఆయనకు రిమాండ్ తప్పలేదు. ఈ విషయాన్ని మీడియాతో పాటు.. అందరూ మర్చిపోయారు. కానీ.. జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ మాత్రం మర్చిపోలేదు. మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న సదరు ఫామ్ హౌస్ జీవో 111కు విరుద్ధంగా కట్టినట్లుగా తాను చేసిన ఆరోపణల్ని పిటిషన్ రూపంలో మార్చారు. దాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎదుట దాఖలు చేశారు.

తాజాగా ఈ పిటిషన్ పై ఎన్టీటీ స్పందించింది. దీన్ని విచారణకు చేపట్టిన ట్రైబ్యునల్ తాజాగా దీన్ని లీజుకు తీసుకున్న రేవంత్ రెడ్డితోపాటు.. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ నిర్మాణాల్ని పరిశీలించి..ఇవి సక్రమమా? కాదా? అన్నది తేల్చేందుకు ఒక నిజ నిర్దారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల లోపు ఇవ్వాలని పేర్కొంది. మొత్తంగా చూస్తే.. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర సర్కారుకు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కొత్త తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు. మరి.. కమిటీ రిపోర్టు ఏ తీరులో ఉంటుందో చూడాలి?
Tags:    

Similar News