ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చ.. బెట్టింగ్ మాయాజాలంలో చిక్కుకుంటున్న క్రికెట్!
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో మైదానంలో ఆట కంటే వెలుపల జరుగుతున్న చర్చలే హాట్ టాపిక్‌గా మారాయి.;
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో మైదానంలో ఆట కంటే వెలుపల జరుగుతున్న చర్చలే హాట్ టాపిక్‌గా మారాయి. లీగ్ ఇంకా సగం కూడా పూర్తికాకముందే సోషల్ మీడియా వేదికగా "మ్యాచ్ ఫిక్సింగ్" అనే పదం మార్మోగిపోతోంది. ముఖ్యంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. గెలవాల్సిన మ్యాచ్‌ను ఢిల్లీ చేజేతులా కోల్పోయిందని దీని వెనుక ఏదో మతలబు ఉందంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
వివాదానికి కారణమైన ఆ 'నిమిషం'
ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య జరిగిన పోరులో కొన్ని సంఘటనలు ప్రేక్షకుల్లో అనుమానాలకు తావిచ్చాయి. కీలక సమయంలో అనుభవజ్ఞుడైన బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సింగిల్ తీసుకోకపోవడం, ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి తోడు సదరు రనౌట్‌కు సంబంధించిన రిప్లే విజువల్స్‌ను బ్రాడ్‌కాస్టర్లు సరిగ్గా చూపించలేదని నిర్ణయం తీసుకోవడంలో పారదర్శకత లోపించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ వంటి బలమైన లైనప్ ఉన్న జట్టు ఇలాంటి తప్పిదాలు చేయడం వెనుక ఫిక్సింగ్ హస్తం ఉందని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఫిక్సింగ్ ఆరోపణల వెనుక 'బెట్టింగ్' ఆవేదన?
అయితే ఈ విమర్శలను లోతుగా పరిశీలిస్తే క్రికెట్ పట్ల ఉన్న ఆందోళన కంటే బెట్టింగ్‌లో నష్టపోయిన వారి ఆవేదనే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ జట్టు సులభంగా గెలుస్తుందని అంచనా వేసి భారీగా డబ్బులు పందెం కాసిన వారు.. ఫలితం తలకిందులు కావడంతో ఆ నిరాశను "ఫిక్సింగ్" అనే ముద్ర వేసి తీర్చుకుంటున్నారు. కేవలం ఈ మ్యాచ్ మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ముంబై దిగ్గజాలను యువ ఆటగాళ్లు వైభవ్, జైస్వాల్ అడ్డుకోవడాన్ని కూడా కొందరు అనుమానపు దృష్టితో చూడటం గమనార్హం.
అదుపు తప్పని బెట్టింగ్ సంస్కృతి
ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వందలాది బెట్టింగ్ యాప్‌లను నిషేధించినా ఈ అక్రమ దందా ఆగడం లేదు. విదేశీ సర్వర్ల ద్వారా కొత్త పేర్లతో మార్కెట్లోకి వస్తున్న వెబ్‌సైట్లు యువతను ఆకర్షిస్తున్నాయి. ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయిపోవచ్చనే భ్రమలో పడి సామాన్యులు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే నష్టాలను తట్టుకోలేక, ఆటగాళ్ల నిజాయితీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు.
ఆటను వినోదంగానే చూడండి
క్రికెట్ అనేది అత్యంత అనిశ్చితి కలిగిన ఆట. మైదానంలో వ్యూహాలు అప్పుడప్పుడు బెడిసికొట్టవచ్చు, ఒత్తిడిలో ఆటగాళ్లు తడబడవచ్చు. అంతమాత్రాన ప్రతిదీ ఫిక్సింగ్ అని భావించడం పొరపాటే. ఐపీఎల్ అనేది ఒక వినోదభరిత క్రీడ. దీన్ని జూదంగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. బెట్టింగ్ అనేది గెలుపు కోసం వేసే అడుగు కాదు.. అది అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లే ఒక ఉచ్చం మాత్రమే.
ప్రేక్షకులు ఆటలోని నైపుణ్యాన్ని ఉత్కంఠను ఆస్వాదించాలి తప్ప, తమ స్వార్థ ప్రయోజనాల కోసం క్రీడను అప్రతిష్టపాలు చేయకూడదని క్రీడా విశ్లేషకులు కోరుతున్నారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి క్రికెట్‌ను కేవలం క్రీడగా మాత్రమే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.