అతి చిన్న దేశం.. అగ్రరాజ్యాన్ని వణికించిందా..? ట్రంప్ చర్చల వరకు రావడానికి కారణం ఇదేనా?
‘సర్వనాశనం చేస్తాం’ అన్న ట్రంప్ గర్జనలు, అత్యాధునిక క్షిపణి దాడులు.. ఇవేవీ ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయని 40 రోజుల యుద్ధం స్పష్టం చేస్తోంది.;
‘సర్వనాశనం చేస్తాం’ అన్న ట్రంప్ గర్జనలు, అత్యాధునిక క్షిపణి దాడులు.. ఇవేవీ ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయని 40 రోజుల యుద్ధం స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యం వేసిన లెక్కలన్నీ తప్పని నిరూపిస్తూ, ఇరాన్ ఒక గట్టి పిండంలా నిలబడటమే కాకుండా, ఇప్పుడు శాంతి చర్చల్లో పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. యుద్ధం అంటే కేవలం ఆయుధాల బలం మాత్రమే కాదు.., ప్రజల మద్దతు, మొండి పట్టుదల అని ఇరాన్ నిరూపించింది. ఖమేనీ వంటి అగ్రనేతను కోల్పోయినా సడలని ఆ దేశ పట్టుదల, ఇప్పుడు ట్రంప్ యంత్రాంగాన్ని పునరాలోచనలో పడేసింది.
ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రతిఘటన
యుద్ధం ప్రారంభంలో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఇరానీయులు, విదేశీ దాడి మొదలవ్వగానే దేశం కోసం ఏకంగా నిలిచారు. ఇదే ఇరాన్ కు అతిపెద్ద బలంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ సాంకేతికంగా ఎంత బలంగా ఉన్నా, ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకుపోవడం అంత సులభం కాదని ఈ 40 రోజుల యుద్ధం రుజువు చేశాయి. ఐఆర్‌జీసీ కల్పించిన భరోసా, ప్రజల్లో పెరిగిన జాతీయవాదం ఇరాన్‌ను చర్చల వరకు తీసుకువెళ్లాయి.
హర్మూజ్ ను అడ్డంపెట్టుకొని ఆర్థిక వ్యూహం
హర్మూజ్ జలసంధిని కేవలం నౌకల రాకపోకలకే కాకుండా, తమ ఆర్థిక వనరుగా మలచుకోవాలని ఇరాన్ భావించడం తెలివైన ఎత్తుగడగా మారింది. అమెరికా షరతులకు తలొగ్గకుండా, తమ సైనిక పర్యవేక్షణలోనే నౌకలను అనుమతిస్తామని చెప్పడం ద్వారా ఆ ప్రాంతంపై తమ సార్వభౌమాధికారాన్ని ఇరాన్ చెప్పకనే చూపించింది. పైగా సుంకాల వసూలు అనే ప్రతిపాదన ద్వారా అమెరికాపై ఎదురుదాడి చేస్తూనే, తన ఖజానాను నింపుకునే ప్లాన్ కూడా చేస్తోంది.
షరతుల యుద్ధంలో ఇరాన్ విజయం..!
ట్రంప్ ప్రతిపాదించిన 15 షరతుల కంటే ఇరాన్ పెట్టిన 10 షరతులకే ప్రాధాన్యత దక్కుతుండడం అమెరికా దౌత్య వైఫల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అణు కార్యక్రమాన్ని వదులుకోవాలన్న ప్రధాన షరతును ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం గమనార్హం. ఖమేనీ వారసుడిగా వచ్చిన మొజ్తాబా, తండ్రి కంటే కఠినమైన వైఖరిని అవలంబిస్తుండడం అమెరికాకు తలనొప్పిగా మారింది.
ఈ యుద్ధంలో అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించినా, రాజకీయంగా, దౌత్యపరంగా ఇరాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఒక చిన్న దేశాన్ని బెదిరించి లొంగదీసుకోవాలనుకున్న ట్రంప్ వ్యూహం ఇక్కడ విఫలమైంది. ఇరాన్ తన పౌరుల మద్దతును కూడగట్టుకోవడమే కాకుండా, అంతర్జాతీయంగా తన ఉనికిని చాటుకుంది. అయితే, ఈ పట్టుదల శాశ్వత శాంతికి దారితీస్తుందా లేదా అనేది సందేహమే. ఇరాన్ పెట్టిన షరతులను అమెరికా అంగీకరిస్తే అది ట్రంప్ వ్యక్తిత్వానికి ఒక పెద్ద దెబ్బ అవుతుంది. అలాగే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగించడం ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మొత్తానికి, ఇరాన్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు, అగ్రరాజ్యాల అహంకారాన్ని సవాలు చేయగల శక్తి అని ఈ యుద్ధం నిరూపించింది. వ్యూహాత్మకంగా ఇరాన్ సాధించిన ఈ ఆత్మవిశ్వాసం పశ్చిమాసియా రాజకీయాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది.