మూడు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్.. అధికార పార్టీలకు సంకటం!
దేశంలోని మూడు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.;
దేశంలోని మూడు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే.. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనడం.. అందునా మహిళలు ఎక్కువగా క్యూలైన్లలో ఉండడంతో అధికార పార్టీలు ఒకరకంగా సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే.. మహిళలు ఎక్కువగా ఓటింగ్ చేసినరాష్ట్రాల్లో అధికారం మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 శాసన సభ స్థానాలకు 294 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 9 లక్షల 50 వేల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. కాగా.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి..మంగళం నియోజకవర్గంలో తన ఓటు వేశారు. అయితే.. ఆయన ద్విచక్ర వాహనంపై పోలింగ్ కేంద్రానికి వచ్చి వెళ్లడం విశేషం. కాగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 39 శాతం పోలింగ్ నమోదైంది.
కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో 883 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 2 కోట్ల 71 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. దీంతో చాలా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కాగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 36.28 శాతం పోలింగ్ నమోదైంది.
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలలో మొత్తం 722మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2 కోట్ల 50 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. అస్సాంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం అధికారులు పటిష్ఠ భద్రతను కల్పించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు.. ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కాగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 41.92 శాతం పోలింగ్ నమోదైంది.