వారిద్దరి నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి చేటు : రేవంత్

Update: 2021-12-28 10:32 GMT
కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి సాగు అవుతోందంటూ.. రెండ్రోజుల క్రితం బాంబు పేల్చి రాష్ట్ర రాజకీయాలను మళ్లీ కుదిపేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులను వరి సాగు చేయొద్దంటూ ఓ వైపు చెబుతూ.. మరోవైపు సాక్షాత్తూ సీఎం వ్యవసాయ క్షేత్రంలోనే వంద ఎకరాలపైగా వరి సాగవుతోందని ఆరోపించారు. అంతేకాక.. రచ్చబండ అంటూ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న ఎర్రవల్లికి ప్రయాణం పెట్టుకున్నారు.

అయితే, సోమవారం తెల్లవారుజామునే రేవంత్ ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు.. ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. రేవంత్ తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎర్రవల్లి గ్రామాన్నీ దిగ్బంధించారు. కాగా, రేవంత్ చేపట్టిన కార్యక్రమానికి ప్రతిగా రాష్ట్ర మంత్రులు స్పందించారు. బీజేపీలో కాంగ్రెస్ విలీనం ఖాయమంటూ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

అటు ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నిరుద్యోగ దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. దీనికి కౌంటర్ గానా అన్నట్లు రేవంత్ మంగళవారం స్పందించారు. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి, కేసీఆర్‌ నాయకత్వం తెలంగాణకు ప్రమాదకరమని ఆరోపించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. మంత్రుల ఆరోపణలకు విలువ లేదు అన్నట్లు.. చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్ చరిత్రను రూపు మాపలేరని, దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.

అంతేకాకుండా సోనియా గాంధీ నాయకత్వమే దేశానికి రక్ష అని పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన బాధ్యత గాంధేయవాదులపై ఉందన్నారు. పార్లమెంట్ లో 80 మంది కంటే ఎక్కువ మహిళలు లేరని, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఆడ బిడ్డల అభిప్రాయం తీసుకోవాలి కానీ హడావుడి నిర్ణయం సరికాదని హితవు పలికారు. దేశానికి మోడీ, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ నాయకత్వం ప్రమాదకరమని ఆయన విమర్శించారు. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో ముందుకు వెళ్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News