ఖైదీల కష్టాలపై గళం విప్పిన రేవంత్‌

Update: 2015-07-03 04:50 GMT
ఎవరి మనసు దోచుకున్నా దోచుకోకున్నా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చర్లపల్లి ఖైదీల మనసుల్ని దోచుకోవటం ఖాయమన్నట్లు కనిపిస్తోంది. ఇంతమంది రాజకీయ నాయకుల్లో ఎంతోకొంతమంది చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన వారే. కానీ.. వారు ఎవరూ ప్రస్తావించని అంశాల్ని రేవంత్‌ ప్రస్తావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో (సాంకేతికంగా నాలుగైదు రోజులు తేడాతో) గడిపిన ఆయన అక్కడ ఖైదీలు పడుతున్న పాట్లను ప్రస్తావిస్తున్నారు.

వారానికి రెండు సార్లు ఫోన్‌ చేసే సౌకర్యం ఖైదీలకు ఉంటుందని.. ఫోన్‌ కాల్‌కు రూపాయి చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. జైలు సిబ్బంది మాత్రం ఒక్కో కాల్‌కి రూ.25 దండుకుంటున్నారని పేర్కొన్నారు. రూ.25లతో అమెరికాకు సైతం మాట్లాడే వీలుందని చెప్పిన ఆయన.. జైల్లో దోపిడీ గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు. అంతేకాదు.. ఉపాధిహామీ కూలీలకు ఒకరోజు పని చేస్తే రూ.170 ఇస్తున్నారని కానీ.. జైల్లో ఖైదీలకు మాత్రం రోజు పని చేస్తే రూ.30 ఇస్తున్నారని చెప్పారు.

పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ప్రభుత్వం జైల్లోని ఖైదీలకు మాత్రం దొడ్డు అన్నాన్నే తినిపిస్తోందని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తాను ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పిన రేవంత్‌.. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తానన్నారు. మొత్తానికి.. జైలు జీవితంలోనూ.. జైల్లోని సహచర ఖైదీల కష్టసుఖాల్ని చూడటమే కాదు.. వారి గురించి జైలు నుంచి వచ్చిన తర్వాత మాట్లాడిన నేతల్లో రేవంత్‌రెడ్డే ముందుంటారేమో.

Tags:    

Similar News