అన్నా.. రేవంత్ ఎపిసోడ్ దెబ్బేసిందే!

Update: 2018-09-30 05:18 GMT
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ క‌మ్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అక్ర‌మాస్తులు ఉన్న‌ట్లుగా వ‌చ్చిన ఫిర్యాదును సీరియ‌స్ గా తీసుకొని పెద్ద ఎత్తున త‌నిఖీలు చేప‌ట్ట‌టం సంచ‌ల‌నంగా మారింది. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న రోజున తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు తిరుగులేద‌ని.. కేసీఆర్ కాబోయే ముఖ్య‌మంత్రి అన్న మాట‌లో ఎవ‌రికి ఎలాంటి సందేహాలు ఉండేవి కావు.

ఆ మాట‌కు వ‌స్తే.. ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత దూరంలో టీఆర్ఎస్ ఉంద‌ని.. దాని బ‌లం ముందు మ‌రే రాజ‌కీయ పార్టీ నిలువ‌ద‌న్న వాద‌న జోరుగా వినిపించింది. ఇదిలా ఉంటే.. కేవ‌లంనెల వ్య‌వ‌ధిలో సీన్ మొత్తం మారిన‌ట్లుగా అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ్గారెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లపై కేసుల వేధింపులు చోటు చేసుకున్నాయ‌ని.. రాజ‌కీయంగా ఉన్న శ‌త్రుత్వంతోనే వారిని వేధింపుల‌కు గురి చేస్తున్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. త‌న‌పైనా.. త‌న ఆస్తుల‌పైనా త‌నిఖీలు చేసే అవ‌కాశం ఉంద‌ని.. త‌న‌ను ఇరుకున పెట్టేందుకు భారీగా స్కెచ్ వేస్తున్న‌ట్లుగా రేవంత్ రెడ్డి అదే ప‌నిగా వ్యాఖ్య‌లు చేస్తున్న వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లే ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. చూశారా.. నేను చెప్పిందే జ‌రిగింది.. కేసీఆర్ అండ్ కో న‌న్ను ఇబ్బంది పెట్టేందుకే త‌మ‌కున్న అధికారాల‌తో త‌నిఖీల వేధింపుల‌కు గురి చేస్తున్నార‌న్న మాట రేవంత్ నోటి నుంచి వ‌స్తోంది.

ప్ర‌త్య‌ర్థిని అశ‌క్తుడ్ని చేసి.. అత‌డ్ని దెబ్బ తీయాల‌న్న ప్ర‌య‌త్నం జ‌రిగిన ప్ర‌తిసారీ.. ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌స్తుంటుంది. ఇటీవ‌ల జ‌గ్గారెడ్డి ఉదంతంలోనూ.. తాజాగా రేవంత్ విష‌యంలోనూ వారిపై అంత‌కంత‌కూ సానుకూల‌త వ్య‌క్తం అవుతోంద‌న్న మాట గులాబీ నేత‌లే స్వ‌యంగా మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తోంది. జ‌గ్గారెడ్డి ఎపిసోడ్ కార‌ణంగా పార్టీ బ‌ద్నాం అయింద‌న్న వేద‌న‌ను గులాబీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా చోటు చేసుకున్న రేవంత్ ఎపిసోడ్ పార్టీపైన ప్ర‌భావాన్ని చూప‌ట‌మే కాదు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో సానుభూతి రిజిస్ట‌ర్ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. దూకుడు ఉండ‌టం మంచిదే కానీ.. ఈ త‌ర‌హా దూకుడుతో లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌న్న మాట గులాబీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. గ‌డిచిన రెండు రోజులుగా గులాబీ వ‌ర్గంలో రేవంత్ ఎపిసోడ్ పై భారీగా చ‌ర్చ జ‌రుగుతున్నా.. త‌మ ఫీలింగ్స్ ను.. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌న్న విష‌యాన్ని కేసీఆర్ అండ్ కోకు చెప్పే ధైర్యం ఎవ‌రికి ఉంద‌న్న మాట వినిపిస్తోంది. నిజ‌మే.. అది కూడా పాయింటే.  
Tags:    

Similar News