ఇక సొంతూళ్ల‌కు వెళ్ల కుండానే ఓటేయొచ్చు!

Update: 2022-12-29 11:42 GMT
భార‌త‌దేశంలో ఎన్నిక‌ల్లో ఓటింగు శాతం పెంచ‌డానికి ఎన్నిక‌ల సంఘం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్పుడు ఓట‌ర్ల‌కు మ‌రింత సౌల‌భ్యం క‌ల్పించే 'రిమోట్ ఎల‌క్ట్రానిక్  ఓటింగ్ మెషిన్' (Remote Electronic Voting Mechine - REVM) ను రంగంలోకి తెస్తోంది. దీని ద్వారా ఇక‌పైన ఓట‌ర్లు త‌మ సొంతూళ్ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా తామున్న చోటు నుంచే  ఎంచెక్కా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చు.

జీవనోపాధి నిమిత్తం ఉన్న ఊరిని వ‌దిలి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు మ‌న దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నిక‌ల వేళ వీరు త‌మ సొంతూరుకు వెళ్లి త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం క‌ష్ట సాధ్యంగా మారుతోంది. అలా వెళ్లాలంటే ప్ర‌యాణ ఖ‌ర్చులు, వ్య‌య ప్ర‌యాస‌లు ప‌డాల్సి వ‌స్తోంది. దాంతో చాలా మంది ఓటింగ్‌లో పాల్గొన‌కుండా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారి ఓటింగ్ శాతం పెంచేలా భార‌త ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 'రిమోట్ ఎల‌క్ట్రానిక్  ఓటింగ్ మెషిన్' ( Remote Electronic Voting Mechine - REVM  ) ను అమ‌ల్లోకి తీసుకువ‌స్తోంది.

ఈ యంత్రం ద్వారా ఓట‌ర్లు త‌మ సొంతూరుకు వెళ్ల‌కుండా తాము ఉన్నప్రాంతం నుంచే త‌మ ఓటు హ‌క్కు వ‌నియోగించుకోవ‌చ్చు. ఇందుక‌సం రిమోట్ పోలింగ్ బూత్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రిమోట్ పోలింగ్ బూత్ నుంచీ 72 నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును తామున్న ప్రాంతం నుంచే వినియోగించుకోవ‌చ్చు . ఈ త‌ర‌హా కొత్త సాంకేతిక విధానాన్ని ఎన్నిల‌క సంఘం సిద్ధం చేసింది

ఈ కొత్త సాంకేతిక విధానం గురించి వివ‌రించేందుకు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఎన్నిక‌ల సంఘం ఆహ్వానిస్తోంది. జ‌న‌వ‌రి 16వ తేదీన ఒక స‌మావేశం ఏర్పాటు చేసి అందులో ఈ కొత్త సాంకేతిక విధానం గురించి రాజ‌కీయ పార్టీల‌కు వివ‌రించ‌నుంది. మ‌న దేశంలో రాష్ట్రాల మ‌ధ్య వ‌ల‌స‌లు 85 శాతం ఉన్నాయ‌ని ఒక అంచ‌నా.  

కేంద్ర వ‌ద్ద ఈ వ‌ల‌స‌ల‌కు సంబంధించి నిర్దిష్ట‌మైన గ‌ణాంకాలు ఏమీ లేక‌పోయినా, ఉద్యోగం, ఉపాధి, వివాహం, చ‌దువు, వ్యాపారం త‌దిత‌ర అనేక కార‌ణాల‌తో ప్ర‌జ‌లు ఒక చోటు నుంచీ మ‌రో చోటుకు వ‌ల‌స వెళుతున్నార‌ని ఎన్నిక‌ల సంఘం విశ్లేషించింది.  పోలింగ్ రోజు వీరిలో చాలా మంది త‌మ సొంతూరికి వెళ్లి ఓటు వేయ‌లేక‌పోతున్నార‌ని గుర్తించింది. అలాంటి వారి సౌల‌భ్యం కోసం ఈ కొత్త త‌ర‌హా విధానాన్ని తీసుకొస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News