17 ఏళ్ల నిర్భందం - 17 ఏళ్ల ప్రవాసం... బంగ్లా ప్రధానిగా 'డార్క్ ప్రిన్స్'!
అవును... బంగ్లాదేశ్ లో గురువారం జరిగిన అత్యంత కీలకమైన ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించింది.;
మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో తలదాచుకుంటున్న వేళ బంగ్లాదేశ్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఫిబ్రవరి 12న జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది ఊహించినట్లుగానే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీ.ఎన్.పీ) విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్ లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు పార్టీ ప్రకటించింది. దీంతో.. అప్పట్లో 'డార్క్ ప్రిన్స్' గా పిలవబడిన తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.
అవును... బంగ్లాదేశ్ లో గురువారం జరిగిన అత్యంత కీలకమైన ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించింది. 299 స్థానాల్లోనూ మిత్రపక్షాలతో కలిసి 212 స్థానాల్లో పార్టీ గెలుపొందగా.. జమాతే-ఇ-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి 70 స్థానాల్లో గెలుపొందింది. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కు కాబోయే ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ గురించిన చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఆయన ప్రవాస జీవితం మరోసారి తెరపైకి వచ్చింది.
ఎవరీ తారిఖ్ రెహ్మాన్ అలియాస్ 'డార్క్ ప్రిన్స్'!:
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావూర్ రెహ్మాన్, ఆ దేశానికి మూడుసార్లు ప్రధాన మంత్రి ఖలీదా జియా దంపతుల పెద్ద కుమారుడే ఈ 60 ఏళ్ల తారిఖ్ రెహ్మాన్. సుమారు 17ఏళ్ల ప్రవాసం నుంచి ఇటీవల తన తల్లి మరణం తర్వాత దేశానికి తిరిగివచ్చిన తారిఖ్... షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ లేకపోవడంతో ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడంలో ముందు వరుసలో నిలిచారు. తల్లి మరణానంతరం బీ.ఎన్.పీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఎందుకీ 'డార్క్ ప్రిన్స్' పిలుపు!..?:
2001 - 2006 మధ్య బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) - జమాత్-ఇ-ఇస్లామీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ దేశ ప్రధానమంత్రి ఖలీదా జియా గణ భవన్ లో ప్రభుత్వాన్ని నడిపేవారు. అయితే దానికి అర కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఆమె కుమారుడు తారిఖ్ రెహమాన్ 'హవా భవన్' లో సమాంతర ప్రభుత్వాన్ని తనదైన భీభత్సపు శైలిలో నడపడం మొదలుపెట్టారని అంటారు. ఆ కాలంలో ఇది బంగ్లాదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తి కేంద్రంగా పనిచేసింది.
ఈ క్రమంలోనే... బంగ్లాదేశ్ చరిత్రలో హవా భవన్ ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అంటారు. దౌత్యవేత్తలు, నిఘా అధికారులు, జర్నలిస్టు, బీ.ఎన్.పీ అంతర్గత వ్యక్తులు కూడా దీన్ని.. మంత్రిత్వ శాఖలు, చట్టాలు, సంస్థలను దాటి నిజమైన నిర్ణయాలు తీసుకునే ప్రదేశంగా అభివర్ణించారు. ఈ క్రమంలో 2005లో అప్పటి యూఎస్ ఛార్జ్ డీ'అఫైర్స్ జుడీత్ ఎ చమ్మాస్... తారిఖ్ రెహ్మాన్ ను 'చీకటి యువరాజు' గా అభివర్ణించారు.
17 నెలల పాటు నిర్బంధం..!:
మే 2007లో అప్పటి తాత్కాలిక ప్రభుత్వం తారిఖ్ రెహ్మాన్ ను అరెస్ట్ చేసింది. ఈ సమయంలో మనీలాండరింగ్ తో పాటు పలు అభియోగాలు.. ప్రధానంగా షేక్ హసీనాను హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో సుమారు 17 నెలల పాటు నిర్భందంలో ఉంచింది. అయితే.. 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత ఆయనపై ఉన్న అభియోగాలు, తీర్పులు రద్దు చేయబడ్డాయి!
తారిఖ్ రెహ్మాన్ కు అమెరికా అభినందనలు!:
తారిఖ్ రెహ్మాన్ విజయం పట్ల అమెరికా కూడా స్పందించింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లోని అమెరికా రాయబారి బ్రెంట్ టి క్రిస్టెన్సెస్.. ఎన్నికలు విజయవంతంగా ముగిసినందుకు బంగ్లాదేశ్ ప్రజలకు, మీ విజయంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి, తారిఖ్ రెహ్మాన్ కు అభినందనలు.. మన రెండు దేశాల శ్రేయస్సు, భద్రత ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి మీతో కలిసి పనిచేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఎదురుచూస్తోంది అని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.