దొంగ జీవితమే వారికి ఇష్టం!

Update: 2015-04-08 22:30 GMT
ఎర్ర చందనం దొంగలుగా బతుకుతున్న జవ్వాది కొండల్లోని ప్రజలందరికీ దొంగలుగా, స్మగ్లర్లుగా బతకడమే ఇష్టం. జన జీవన స్రవంతిలోకి రావాలని కోరినా వాళ్లు రారు. అందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయి. వారికి చెప్పి చెప్పి అధికారులకే విసుగు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు.

ఎర్ర చందనం అక్కడి కూలీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నెలకు నాలుగు రోజులు కష్టపడితే చాలు నెలంతా హాయిగా ఎంజాయ్‌గా బతికేయొచ్చు. నాలుగు రోజులు కష్టపడితే నెలంతా తాగి తందనాలు ఆడవచ్చు. ఎర్ర చందనం దుంగలు తెచ్చినందుకు వారికి రోజుకు రూ.5000 కూలీ ఇస్తారు. నాలుగైదు రోజులు పనిచేస్తే వారికి రూ.25 వేలు వస్తాయి. ఆ గ్రామాల్లో.. కొండ కోనల్లో పాతిక వేలంటే ఇష్టారాజ్యంగా బతకవచ్చు. నాలుగైదు రోజులు పనిచేసి నెల రోజులు ఎంచక్కా గడిపేస్తారు. అందుకే వారంతా కూడా దొంగలుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఇక వారిలో కొంతమంది మేస్త్రీలు ఉంటారు. వారికి వారానికి లక్ష రూపాయల వరకూ కిట్టుబాటు అవుతుంది. వారానికి లక్ష రూపాయలు వస్తుంటే ఎవరికి చేదు.

ఇంతింత ఆదాయం ఉండడంతోనే వారంతా దొంగలు, స్మగ్లర్లుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అయితే, వారిని జన జీవన స్రవంతిలోకి తీసుకు రావాలని, వారిలో మార్పు తీసుకు రావాలని గతంలో ఏపీ పోలీసులు, అటవీ సిబ్బంది భావించారు. పలు సందర్భాల్లో జవ్వాది కొండలకు వెళ్లి వారికి అవగాహన కల్పించడానికి, ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించడానికి ప్రయత్నించారు. అయితే, ఆయా పల్లెల్లోని ఆడవాళ్లు అధికారులను ఈసడించారు. ''చంపుకుంటారా చంపుకోండి. మాకు దొంగతనమే ఇష్టం. మేం దొంగలుగానే ఉంటాం. చావనైనా చస్తాం కానీ ఎర్ర చందనం దొంగతనం మాత్రం మానం'' అని తెగేసి చెప్పారు. అధికారులు వచ్చిన తర్వాత కనీసం పది నిమిషాలు అంటే పది నిమిషాలు కూడా వారి మాటలు వినలేదు. ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి. మరి, వారిని జన జీవన స్రవంతిలోకి తీసుకు రావడానికి ఏం చేయాలో ప్రతి ఒక్క ఆలోచనా పరుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News