ఆర్మూరు వాన లెక్క తెలిస్తే అవాక్కు!!

Update: 2016-09-25 05:24 GMT
కేవలం 24 గంటల వ్యవధిలో కురిసిన వర్షంతో ఆర్మూరు వాసులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. వాన అంటే హడలిపోయే పరిస్థితి. వానా వానా వల్లప్ప అంటూ సరదా పాటను కలలో కూడా పాడుకోవటానికి ఇష్టపడని రీతిలో ఉన్నారు ఆర్మూరు వాసులు. ఎందుకంటే.. వర్షంలోని పాడు కోణం అక్కడి వారికి అనుభవంలోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని ఈ బుజ్జి పట్టణాన్ని శుక్రవారం నాడు కురిసిన వాన ఊపిరి ఆడకుండా చేసింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటలు.. అంటే 24 గంటల వ్యవధిలో కురిసిన వర్షం ఎంతో తెలుసా? ఏకంగా 39.5 సెంటీమీటర్లు.

  గంటలో నాలుగైదు సెంటీమీటర్ల వర్షానికే మహా నగరం లాంటి హైదరాబాద్ ఎంత గజగజలాడిపోయిందో తెలిసిందే. అలాంటివి 24 గంటల పాటు 40 సెంటీమీటర్ల వాన కురవటం అంటే మాటలు కాదు. కుంభవృష్టి అన్న మాటను రియల్ గా చూసేశారు ఆర్మూరు వాసులు. తాజాగా కురిసన వానతో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.

తెలంగాణ చరిత్రలో ఒక్కరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక వర్షపాతం రికార్డుతో పాటు.. దేశంలోనే రికార్డు స్థాయి వర్షపాతంగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఆర్మూరు పట్టణంపై కమ్మిన క్యుములోనింబస్ మేఘాల కారణంగానే ఇంతటి భారీ వర్షపాతం న‌మోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే ఆర్మూరులో 1983 అక్టోబరు 6న 24 గంటల వ్యవధిలో 35.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 33 ఏళ్ల తర్వాత కురిసిన కుంభవృష్టితో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అంతేకాదు.. గడిచిన 108 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో నమోదైన గరిష్ఠ వర్షపాతం కూడా తాజాగా కురిసిన ఆర్మూరుదే కావటం గమనార్హం. రికార్డుల మాటను కాసేపు పక్కన పెడితే.. స్వల్ప వ్యవధిలో కురిసిన వానతో ఆర్మూరు పట్టణవాసులు ఎంతగా వణికిపోయారో ఒక్కసారి ఊహించుకుంటే ఒళ్లు జలదరించటం ఖాయం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News