పవన్‌ కు లోకేష్ అంటే ఎందుకు మంట

Update: 2018-07-09 13:30 GMT
జనసేన నాయకుడు - సినీ హీరో పవన్ ‌కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి - ముఖ‌్యమంత్రి తనయుడు నారా లోకేష్ అంటే చిరాకెత్తుతోంది. తన రాజకీయ పర్యటనలు ప్రారంభించినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన విమర్శనాస్త్రాలను నారా లోకేష్ పైనే సంధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో  వేల కోట్ల అవినీతికి లోకేషే బాధ్యుడంటూ మండిపడుతున్నారు. తాజగా నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి కానివ్వనంటూ ఓ ప్రకటనే చేశారు. లోకేష్ పై జన సేనానికి ఇంత ఆగ్రహం ఎందుకు? ప్రభుత్వంలో ము‌ఖ్యమంత్రిని - ఇతర మంత్రులను వదిలేసి లోకేష్ వెనుకే ఎందుకు పడుతన్నారు.? ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీలో కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని అటు తెలుగుదేశం పార్టీలోను - ఇటు జనసేనలోను కూడా చర్చలు జరుగుతున్నాయి.

ఏ అర్హత లేకుండా కేవలం  ముఖ్యమంత్రి కుమారుడు అనే ఒక్క అర్హతతో మంత్రి కావడాన్ని  తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు తమ అక్కసును పవన్ కల్యాణ్ వద్ద వెల్లిబుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి అతి సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లోకేష్ నిర్వహిస్తున్న పాత్రపై - ఆయన అవినీతిపై ఆ మంత్రే ఉప్పందిస్తున్నట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు పవన్ కల్యాణ్ మంత్రి లోకేష్ పై విరుచుకుపడుతున్నట్టు చెపుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆ మంత్రితో పాటు - తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ మంత్రి కూడా లోకేష్ పై గుర్రుగా ఉన్నారు. పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆ సీనియర్ మంత్రే చక్రం తిప్పుతానని అనుకుంటున్న సమయంలో లోకేష్ రంగ ప్రవేశం చేయడం ఆ మంత్రికి మింగుడుపడటం లేదు. దీంతో నారా లోకేష్ అవినీతి చిట్టాను ఆ ఇద్దరు మంత్రులు  పవన్ కల్యాణ్  ముందు విప్పినట్లు చెప్పుతున్నారు

నారా లోకేష్ అవినీతి భాగోతాన్ని తొలుత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనుకున్నారట, అయితే జగన్ - మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేస్తే అవి ప్రతిపక్ష నాయకుడి విమర్శలుగానే చెల్లుబాటు అవుతాయని, అదే పవన్ కల్యాణ్ అయితే పాత స్నేహం కారణంగా ఆయన చేస్తున్నఅవినీతి ఆరోపణలను ప్రజలు నమ్ముతారని ఆ ఇద్దరి మంత్రుల ఆలోచనగా తెలుస్తోంది. నారా లోకేష్ పై, ఆయన అవినీతి పై పవన్ కల్యాణ్ విరుచుకు పడటం వెనుక తెలుగుదేశం పార్టీలో ఉన్న మరికొందరు సినీయర్ నాయకులు ఉన్నారని కూడా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మాటిమాటికి నారా లోకేష్ పై విరుచుకుపడుతున్నా లోకేష్ నుంచి బలమైన స్పందన రాకపోవడంతో పవన్ చేస్తున్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీలో వారు కూడా వాస్తవం అనుకుంటున్నట్లు సమాచారం.
Tags:    

Similar News